Euro 2024: ఇటలీ శుభారంభం

యూరో కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది.

Published : 17 Jun 2024 03:35 IST

యూరో కప్‌

డార్ట్‌మండ్‌ (జర్మనీ): యూరో కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. ఇటలీ తరపున బస్టోని (11వ నిమిషంలో), బెరెల్లా (16వ) చెరో గోల్‌ చేశారు. అల్బేనియా జట్టులో నమోదైన ఏకైక గోల్‌ను బజ్రామి (1వ) కొట్టాడు. మ్యాచ్‌ మొదలైన 23 సెకన్లకే బజ్రామి బంతిని గోల్‌పోస్టులోకి పంపి ఇటలీని కంగుతినిపించాడు. 64 ఏళ్ల యూరో కప్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో అత్యంత తక్కువ సమయంలో నమోదైన గోల్‌ ఇదే. కానీ ఈ ఊహించని షాక్‌ నుంచి ఇటలీ త్వరగానే కోలుకుంది. అత్యుత్తమ ఆటతీరుతో అలరించింది. ప్రత్యర్థి గోల్‌పోస్టుపై దాడులను తీవ్రతరం చేసింది. అయిదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బస్టోని తలతో బంతిని గోల్‌పోస్టులోకి పంపగా.. అనంతరం బెరెల్లా మెరుపు కిక్‌తో గోల్‌ రాబట్టాడు. అక్కడి నుంచి బంతిపై ఇటలీ నియంత్రణ కొనసాగింది. ఆధిపత్యాన్ని చివరి వరకూ నిలబెట్టుకుని ఆ జట్టు విజయతీరాలకు చేరింది. మరోవైపు గ్రూప్‌- డి పోరులో నెదర్లాండ్స్‌ 2-1తో పోలెండ్‌పై గెలిచింది. గక్పో (29వ), వెగోస్ట్‌ (83వ) నెదర్లాండ్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. పోలెండ్‌ ఆటగాడు బుక్సా (16వ) గోల్‌తో మెరిశాడు. ఆరంభంలో 0-1తో వెనుకబడ్డ నెదర్లాండ్స్‌.. గక్పో గోల్‌తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి పోరు మరింత హోరాహోరీగా సాగింది. డ్రాగా ముగిసేలా కనిపించిన మ్యాచ్‌లో చివర్లో వెగోస్ట్‌ గోల్‌తో డచ్‌ జట్టు నెగ్గింది.

యూరో కప్‌లో ఈనాడు 

రొమేనియా × ఉక్రెయిన్‌ (సాయంత్రం 6.30); బెల్జియం × స్లోవేకియా (రాత్రి 9.30); ఆస్ట్రియా × ఫ్రాన్స్‌ (రాత్రి 12.30)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని