IND vs SL : పింక్‌బాల్‌ టెస్టులో విజయం సాధించడంపై రోహిత్ ఏమన్నాడంటే.?

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రోహిత్‌ శర్మ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సిరీస్‌ ఇదే కావడం గమనార్హం. బెంగళూరులో జరిగిన పింక్ బాల్ టెస్టులో..

Published : 14 Mar 2022 20:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రోహిత్‌ శర్మ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సిరీస్‌ ఇదే కావడం గమనార్హం. బెంగళూరులో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం.. అతడు మాట్లాడాడు.   

‘టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగానే కాకుండా జట్టుగా మేమెంతో సాధించాం. ఇంకా చాలా విజయాలు సాధించాల్సి ఉంది. ఈ సిరీస్‌లో రవీంద్ర జడేజా గొప్పగా రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రోజురోజుకీ బ్యాటర్‌గా మరింత మెరుగవుతున్నాడు. ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అంచనాలను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతడు టీ20 సిరీస్‌లో రాణించినట్లే.. టెస్టుల్లోనూ కీలక ఇన్నింగ్సులు ఆడాడు. టెస్టు స్పెష్టలిస్టులు పుజారా, రహానె స్థానాలకు పోటీనిస్తున్నాడు. అలాగే, రిషభ్‌ పంత్‌ కూడా సుదీర్ఘ ఫార్మాట్లో పరిణతి సాధిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచులోనూ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అశ్విన్‌ లెజెండరీ బౌలర్‌. అవకాశం వచ్చినప్పుడల్లా జట్టు విజయంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మాకు డే/నైట్ టెస్టుల్లో చాలా తక్కువ అనుభవం ఉంది. పింక్‌ బాల్‌ టెస్టుల్లో ఇంకా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాలి. ప్రేక్షకులు మళ్లీ స్టేడియాల్లోకి రావడం ఉత్సాహం కలిగిస్తోంది’ అని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. 

* కీలక భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం : కరుణరత్నె

‘ఈ మ్యాచులో మా జట్టు గెలిచి ఉంటే నేను మరింత సంతోషించే వాడ్ని. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బ్యాటింగ్‌ చేయడం కష్టమే. అయినా, నా శాయశక్తులా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాను. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉన్నా.. భారత్‌ని త్వరగా కట్టడి చేయలేకపోయాం. మా జట్టులోని చిన్న చిన్న లోపాలను అధిగమించాల్సి ఉంది. యువ ఆటగాళ్లకు ఇదో అనుభవం. లక్మల్‌తో కలిసి ఆడటం మరిచిపోలేని అనుభూతి. అతడు త్వరలో కౌంటీ క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడు. అక్కడ కూడా గొప్పగా రాణించాలని కోరుకుంటున్నాను’ శ్రీలంక కెప్టెన్‌ దిముత్ కరుణరత్నె పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని