క్రికెటర్లకు రోజూ కరోనా టెస్టు చేస్తే మంచిది!

ఐపీఎల్‌-2020లో భాగస్వాములయ్యే క్రికెటర్లకు ప్రతి రోజూ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తే మంచిదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నారు. ఒకవేళ తానే  క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకొనేందుకు....

Published : 25 Jul 2020 16:11 IST

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా సూచన

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-2020లో భాగస్వాములయ్యే క్రికెటర్లకు ప్రతి రోజూ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తే మంచిదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నారు. ఒకవేళ తానే  క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకొనేందుకు ఇబ్బంది పడనని పేర్కొన్నారు. యూఏఈలో ఎనిమిది జట్లతో బయోసెక్యూర్‌ వాతావరణానికి వీలవుతుందో లేదో చూడాలని వెల్లడించారు. ఈఎస్‌పీఎన్‌ క్రిన్‌ఇన్ఫోలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరిస్థితులు మెరుగైతే టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేయడంతో సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య విండో దొరికింది. దేశంలో కేసులు పెరుగుతుండటంతో యూఏఈకి వేదికను మార్చింది. సెప్టెంబర్‌ 19న తొలిమ్యాచ్‌, నవంబర్‌ 8న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతాయి. ఆగస్టు 20లోపు జట్లన్నీ దుబాయ్‌ చేరుకొనేందుకు సిద్ధమవుతున్నాయి.

‘నేనే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకోవడం నాకిష్టం. ఇందులో ఇబ్బందేమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చేయించుకుంటే మంచిది. ఐపీఎల్‌ను సురక్షితంగా, విజయవతంగా నిర్వహించాలంటే మైదానంలో, మైదానం ఆవల కఠిన నిబంధనలు అమలు చేయాలి. ఇందులో రాజీ పడొద్దు. బయో సెక్యూర్‌ వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నించాలి. ఎనిమిది జట్లతో అది కుదురుతుందో లేదో తెలియదు. మేమైతే బీసీసీఐ నుంచి నిర్వహణ ప్రక్రియ నిబంధనల కోసం ఎదురుచూస్తున్నాం’ అని నెస్‌వాడియా అన్నారు.

‘యూఏఈలో టెస్టింగ్‌ రేటు ఎక్కువగానే ఉంది. అందుకు అవసరమైన సాంకేతికత, సామర్థ్యం వారికుంది. ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించేందుకు బీసీసీఐ స్థానిక ప్రభుత్వ సాయం తీసుకోవాలి. భారత్‌లో విమానం ఎక్కే ముందు, దుబాయ్‌లో దిగాక వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే యూఏఈ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాల్సిందే’ అని నెస్‌వాడియా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని