Axar Patel: ఇది నా ‘డ్రీమ్‌ ఇయర్’.. అయితే నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది: అక్షర్‌ పటేల్‌

2021 ఏడాదిని తనకు ‘డ్రీమ్‌ సంవత్సరం’గా అభివర్ణించాడు టీమ్‌ఇండియా ఆటగాడు...

Published : 06 Dec 2021 03:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2021 ఏడాదిని తనకు ‘డ్రీమ్‌ సంవత్సరం’గా అభివర్ణించాడు టీమ్‌ఇండియా ఆటగాడు అక్షర్‌ పటేల్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. అయితే దీంతో సంతృప్తి చెందడం లేదని, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో (52, 41*) బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లోనూ (2/14, 1/42) రాణించాడు. ఇంగ్లాండ్‌, కివీస్‌ వంటి పెద్ద జట్లతో ఆడటం బాగుందని తెలిపాడు. ఎడమ చేతి వాటం ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఉండటంతో అక్షర్‌కు జట్టులోకి వచ్చేందుకు అవకాశం దొరకలేదు. అయితే, ఈ ఏడాది వచ్చిన అవకాశాన్ని అక్షర్‌ రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. మొత్తం ఐదు టెస్టుల్లో 36 వికెట్లను పడగొట్టి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మూడు టెస్టుల్లో 27 వికెట్లను తీశాడు. 

‘‘ఈ సంవత్సరం నా డ్రీమ్‌ ఇయర్‌. గత ఇంగ్లాండ్‌ సిరీస్‌లోనూ కివీస్‌తో మ్యాచ్‌ల సందర్భంగా అత్యుత్తమ బౌలింగ్‌ చేయగలిగా. మధ్యలో ఐపీఎల్‌లోనూ రాణించాను. వ్యక్తిగతంగా నాకు ఉత్తమ సంవత్సరం. ఇన్నాళ్లు నేను పడిన కష్టానికి ఈ ఏడాది ఫలితం దక్కింది. బ్యాటింగ్‌ కోచ్, జట్టు మేనేజ్‌మెంట్ నా బ్యాటింగ్ సామర్థ్యం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘నువ్వు చేయగలవు’ అంటూ నన్ను ప్రోత్సహించారు. గతంలో మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యేవాడిని. అయితే ఇప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. నా బ్యాటింగ్‌ వల్ల జట్టుకు ప్రయోజనం కలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. జడేజా, అశ్విన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్లుగా ఎదిగారు. దీని వల్ల మా బ్యాటర్ల మీద కాస్త ఒత్తిడి తగ్గిస్తుంది. ఇలాగే కొంతకాలం కంట్రిబ్యూట్‌ చేయగలిగితే వ్యక్తిగతంగా నాకు, జట్టుకు ఉపయోగం’’ అని అక్షర్‌ పటేల్‌ వివరించాడు.

న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంకొంచెం ముందు డిక్లేర్డ్‌ చేస్తే బాగుండేదన్న వ్యాఖ్యల మీద అక్షర్‌ స్పందించాడు. ‘‘డిక్లేర్డ్‌కు సంబంధించి ఆలస్యం అయిందని నేను అనుకోవడం లేదు. ఇంకా అప్పటికే ఆటకు చాలా సమయం మిగిలి ఉంది. ప్రణాళిక ప్రకారం ఎంత వీలైతే అంతసేపు బ్యాటింగ్‌ చేయాలని భావించాం. ప్రతి రోజూ మనదే కాదు. అందుకే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం లేకుండా చేయాలని అనుకున్నాం’’ అని తెలిపాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు