పంత్‌.. ఇక నిద్ర చాలు! 

పది నిమిషాల్లో మ్యాచును మలుపుతిప్పే సామర్థ్యం.. ఆడిన రెండో బంతికే సిక్సర్‌ బాదేసే తెగువ.. ఎదుట ఉన్నది ప్రపంచంలోనే అత్యుత్తమ పేసరైనా భయపడని తత్వం.. ఒకే టోర్నీలో అత్యధిక క్యాచులు పట్టిన ఘనత.. ఆసీస్‌...

Updated : 30 Oct 2020 11:50 IST

ధోనీ వారసుడికి రాహుల్‌ సెగ: సెలక్టర్ల వేకప్‌ కాల్‌

పది నిమిషాల్లో మ్యాచును మలుపుతిప్పే సామర్థ్యం.. ఆడిన రెండో బంతికే సిక్సర్‌ బాదేసే తెగువ.. ఎదుట ఉన్నది ప్రపంచంలోనే అత్యుత్తమ పేసరైనా భయపడని తత్వం.. ఒకే టోర్నీలో అత్యధిక క్యాచులు పట్టిన ఘనత.. ఆసీస్‌, ఇంగ్లాండ్‌ గడ్డపై సెంచరీలు కొట్టిన భారత ఏకైక వికెట్‌కీపర్‌.. అంతకుమించి ధోనీకి సరైన వారసుడన్న పేరు. కానీ.. ఇప్పుడదే మహీని అనుకరిస్తున్నానన్న భ్రమలో తన సొంత అస్థిత్వానికే ముప్పు తెచ్చుకున్నాడు. ఆసీస్‌తో వన్డే, టీ20 జట్లలో చోటు కోల్పోయి తన సహచరులతోనే పోటీపడుతున్న రిషభ్‌ పంత్‌కు ఇది ‘వేకప్‌ కాల్‌’.


తెలివైనవాడే..కానీ!

నిజానికి రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఆటగాడు. అతడు క్రీజులో నిలిస్తే మైదానంలో పారే పరుగుల వరద మనందరికీ తెలుసు. టీమ్‌ఇండియాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలని రోహిత్‌ శర్మ, యువీ సహా ఎంతోమంది తపనపడ్డారు. నిలకడ లేమితో ఇబ్బందులు పడ్డారు. అలాంటింది చిన్న వయసులోనే అతడికి జట్టులో చోటు దొరికింది. 13 టెస్టుల్లోనే 38.76 సగటు, 68.57 స్ట్రైక్‌రేట్‌తో 814 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై ఒకటి, ఆసీస్‌ అడ్డాలో మరోకటి శతకాలు బాదేసి.. ఈ ఘనత అందుకున్న భారత ఏకైక వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డులు సృష్టించాడు. పేస్‌కు స్వింగ్‌కూ అనుకూలించే ఆ దేశాల్లో శతకాలు చేయడమంటే మామూలేం కాదు. టెక్నిక్‌, తెగువ ఉంటేనే సాధ్యం. టెస్టు అరంగేట్రంలో ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచి అతడు ఆశ్చర్యం కలిగించాడు. 2018లో అడిలైడ్‌ టెస్టులో ఏకంగా 11 క్యాచులు అందుకొని ఏబీ డివిలియర్స్‌, జాక్‌ రసెల్‌ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఆ సిరీస్‌లో మొత్తం 20 క్యాచులు అందుకొని అత్యధిక క్యాచుల రికార్డునూ కైవసం చేసుకున్నాడు. ధోనీకి సరైన వారసుడిని తానేనని గట్టిగా చాటాడు.


రాహుల్‌తో పోటీలో వెనక్కి


 

వాస్తవంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్‌కు సెలక్టర్లు చాలినన్ని అవకాశాలు ఇచ్చారు. కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి సైతం అతడిని ఎంతో ప్రోత్సహించారు. కానీ అతడు అవే చెత్త షాట్లు ఆడుతూ విసుగుతెప్పించాడు. కెరీర్‌లో 16 వన్డేలు ఆడిన పంత్‌ 26.71 సగటుతో 374 పరుగులే చేశాడు. ఒక్క అర్ధశతకమే సాధించాడు. ఇక ఫేవరెట్‌గా భావించే టీ20ల్లో 28 మ్యాచులాడి 20.50 సగటుతో 410 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలున్నాయి. అయితే మెరుపు ఇన్నింగ్స్‌లు మాత్రం ఎక్కువగా ఆడలేదు. ఉదాహరణకు 2019లో పంత్‌ 12 వన్డేలాడితే వెస్టిండీస్‌పై 71 మినహా మరెప్పుడూ స్కోరు 48 దాటలేదు. ఏడుసార్లు క్యాచ్‌ఔట్‌ అయ్యాడు. ఇందులో చాలాసార్లు షాట్ల ఎంపిక బాగాలేదు. పొట్టి క్రికెట్‌ విషయానికి వస్తే 2019లో 15 ఇన్నింగ్సుల్లో ఒక్కసారి మాత్రమే 65తో అజేయంగా నిలిచాడు. ఎనిమిదిసార్లు 4 పరుగుల్లోపే పెవిలియన్‌ దారిపట్టాడు. ఇదే 2019లో కేఎల్‌ రాహుల్‌ 13 వన్డేల్లో 47.66 సగటుతో 572, 9 టీ20ల్లో 44.50 సగటుతో 356 పరుగులు సాధించాడు. రాహుల్‌ ఓపెనింగ్‌ చేయడాన్ని పక్కకు పెడితే.. టీ20 కెరీర్‌లో అతడు 14 మ్యాచుల్లో 3, 4 స్థానాల్లో ఆడి 439, వన్డే కెరీర్‌లో 13 మ్యాచుల్లో 3-6 స్థానాల్లో ఆడి 431 పరుగులు చేశాడు. ఇవన్నీ పంత్‌కు సెగ పుట్టించే గణాంకాలే మరి. వికెట్‌ కీపింగ్‌ పరంగా చూసినా.. పంత్‌ వన్డేల్లో 4 క్యాచులు, 1 స్టంపింగ్‌, టీ20ల్లో 5 క్యాచులు, 4 స్టంపింగ్స్‌తో ఉన్నాడు. రాహుల్‌ వన్డేల్లో 5 క్యాచులు, 2 స్టంపింగ్స్‌, టీ20ల్లో 3 క్యాచులు, ఒక స్టంపింగ్‌ గట్టి పోటీనిస్తున్నాడు.


గాడి.. తప్పాడు

టీమ్‌ ఇండియాకు మరో వికెట్‌కీపర్‌ అవసరం లేదనుకుంటున్న సమయంలో పంత్‌ ఆటలో అనూహ్యంగా మార్పొచ్చింది. 2019 ఆరంభం నుంచి అతడిలోని అనుభవలేమి బయటపడింది. బాగా సాగుతున్న మ్యాచులో చెత్త షాట్లు ఆడుతూ ఔటై చిరాకు తెప్పించేవాడు. తనకు ఇష్టమైన టీ20 ఫార్మాట్లోనూ అతడిలాంటి ప్రదర్శనే పునరావృతం చేశాడు. ఐపీఎల్‌ తరహా పంత్‌ అంతర్జాతీయ టీ20ల్లో అసలు కనిపించనేలేదు. వికెట్‌కీపింగ్‌లోనూ లోపాలు బయటపడ్డాయి. ధోనీలా బంతిని చూడకుండా విసరడం.. అతడిలాగే స్టంపింగ్స్‌ చేయాలన్న ఆత్రుత.. ఇంకా చెప్పాలంటే పూర్తిగా ధోనీనే అనుకరించాలన్న తపన.. అతడి సొంత లయను దెబ్బతీశాయి. ఒక మ్యాచులోనైతే వికెట్ల అవతలికి బంతి రాకముందే అందుకొని స్టంపింగ్‌ చేసి భంగపడ్డాడు. ఇంతలోనే వృద్ధిమాన్‌ సాహా కోలుకొని టెస్టుల్లోకి వచ్చి అదరగొట్టేశాడు. దాంతో పంత్‌ బ్యాకప్‌ కీపర్‌గా మారిపోయాడు. ఇక వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ ఆ స్థానాన్ని అందిపుచ్చుకున్నాడు. క్రమంగా పంత్‌ ఆటతీరు మరింత పేలవంగా మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైనా అతడిని తుదిజట్టులోకి తీసుకొనే ప్రయత్నమే చేయలేదు కోహ్లీ.


సెలక్టర్ల హెచ్చరిక

ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికవ్వని పంత్‌కు మద్దతుగా ఎవ్వరూ మాట్లాడటం లేదు. గతంలో అతడికి వరుస అవకాశాలు ఇవ్వాలని కోరిన సెహ్వాగ్‌ సైతం అతడి ప్రదర్శన పట్ల విముఖంగా ఉన్నాడు. టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. వన్డే సిరీస్‌లోనైతే కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే కీపర్‌. టీ20ల్లో సంజూను అతడికి బ్యాకప్‌గా ఇచ్చారు. ఎందుకంటే పంత్‌ దేహ దారుఢ్యంతో ఉన్నట్టు అనిపించడం లేదు. ఐపీఎల్‌లోనే ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. కీపర్‌గా చురుగ్గా అనిపించడం లేదు. పైగా కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు. తన బరువు పట్ల నియంత్రణ లేనందుకు సెలక్టర్లు, కెప్టెన్‌ కోహ్లీ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. ఇక లీగులో బ్యాటింగ్‌ పరంగానూ రాణించలేదు. ఒక్క గెలుపు ఇన్నింగ్స్‌ అయినా ఆడలేదు. 31, 37*, 28, 38, 37, 5, 14, 27, 36 వరుసగా చేశాడు. ఇప్పటి వరకు 11 క్యాచ్‌లు అందుకున్నాడు. ధోనీ నీడలోంచి బయటకొచ్చి ఫిట్‌నెస్‌, ఆటపై దృష్టిపెట్టాలని గట్టిగా చెప్పేందుకే సెలక్టర్లు అతడికీ ‘వేకప్‌ కాల్‌’ ఇచ్చారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని