Ravindra Jadeja: జడ్డూ ఖాతాలో అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన టాప్‌ ఆల్‌రౌండర్‌

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజాల సరసన జాబితాలో చేరిపోయాడు.

Published : 01 Mar 2023 20:02 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇందౌర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో (IND vs AUS) ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. ఒకే ఒక్క బౌలర్‌ మాత్రం అడ్డుగా నిలిచాడు.  కీలకమైన నాలుగు ఆసీస్‌ వికెట్లను తీసి భారత్‌ పరువును నిలిపాడు. అతడే టీమ్‌ఇండియా టాప్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి అనంతరం జట్టులోకి తిరిగొచ్చిన జడ్డూ (Jaddu) చెలరేగిపోతున్నాడు. తాజాగా మూడో టెస్టులోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయనప్పటికీ.. భారత్‌ తరఫున నాలుగు వికెట్లు తీసి అదరహో అనిపించాడు. ఇదే క్రమంలో రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు, 5వేలకుపైగా పరుగులు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా (Team India) అవతరించాడు. ఆసీస్‌ ఓపెనర్ ట్రావిస్‌ హెడ్‌ను (Travis Head) ఔట్‌ చేయడంతో అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయంగా 500వ వికెట్‌ తీసినట్లైంది. ఇప్పటి వరకు  298 మ్యాచుల్లోని 241 ఇన్నింగ్స్‌ల్లో 503 వికెట్లతో కొనసాగుతున్న జడేజా.. మూడు సెంచరీలు, 31 అర్ధశతకాల సాయంతో 5,527 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టెస్టు సిరీస్‌లోనూ కీలకమైన పరుగులతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. 

గతంలో భారత్‌ తరఫున క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ (Kapil Dev) మాత్రమే ఈ ఘనతను అందుకొన్నాడు. కపిల్ దేవ్‌ 356 మ్యాచుల్లో 687 వికెట్లు, 9వేలకుపైగా పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయంగా పాక్‌ మాజీలు వసీమ్‌ అక్రమ్, ఇమ్రాన్‌ ఖాన్, షాహిద్‌ అఫ్రిది, బంగ్లాదేశ్‌ సీనియర్‌ ఆటగాడు షకిబ్ అల్‌ హసన్, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్, దక్షిణాఫ్రికా మాజీలు షాన్ పొలాక్, జాక్వెస్‌ క్లిస్, శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్‌ మాత్రమే 500 వికెట్లు, 5వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు.

విరాట్‌తో సమంగా ఉమేశ్‌..

టీమ్‌ఇండియా పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ కూడా తన ఖాతాలో ఓ రికార్డును  వేసుకొన్నాడు. అదీనూ స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీని సమం చేయగా..  మాజీ  కోచ్‌ రవిశాస్త్రిని అధిగమించడం విశేషం. ఆసీస్‌తో మూడో టెస్టులో ఉమేశ్‌ రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో  టెస్టు కెరీర్‌లో 24 సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా మారాడు. ఈ క్రమంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన 17వ బ్యాటర్‌గా అవతరించాడు. విరాట్ కూడా 24 సిక్స్‌లు కొట్టగా.. రవిశాస్త్రి 22 సిక్స్‌లు సాధించాడు. భారత్‌ తరఫున అత్యధికంగా వీరేంద్ర సెహ్వాగ్‌ (91) పేరిట ఉంది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (78), సచిన్ (69), రోహిత్ (68), కపిల్‌ దేవ్ (61) టాప్‌ -5లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని