Zaheer - Jaffer: నీ బౌలింగ్‌ గణాంకాలు కంటే.. నావే ఉత్తమం: జహీర్‌కు జాఫర్‌ సరదా ట్వీట్‌

న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ..

Published : 25 Nov 2021 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ సిరీస్‌ విజయం పక్కనపెడితే ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టీ20 సిరీస్‌లో మూడుసార్లూ భారత సారథి రోహిత్ శర్మ టాస్‌ నెగ్గడం విశేషం. దీనిపై మాజీ క్రికెటర్లు జహీర్‌ ఖాన్‌, వసీం జాఫర్‌ మధ్య ట్విటర్‌ వేదికగా సరదా సంభాషణ జరిగింది. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన టాస్‌ విరాట్‌ కోహ్లీకి మొహం చాటేసింది. కివీస్‌పై రోహిత్ మూడు మ్యాచుల్లోనూ టాస్ నెగ్గడంపై జహీర్‌ ఖాన్‌ ‘‘ ఇదొక అరుదైన సంఘటన. కాయిన్‌లో ఏమైనా రహస్య చిప్‌ ఉందా?. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మూడుసార్లూ భారతే టాస్‌ నెగ్గడం’’ అని సరదా ట్వీట్ చేశాడు. దీనికి జాఫర్‌ భలేగా సమాధానం ఇచ్చాడు. ‘‘టాస్ నెగ్గడం అరుదో కాదో కానీ.. జహీర్‌ కంటే నా బౌలింగ్ గణాంకాలే ఉత్తమంగా ఉండటం మాత్రం అరుదైన విషయమే’’ అని గణాంకాలకు సంబంధించిన ఇమేజ్‌ను జాఫర్‌ పోస్ట్‌ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వసీం జాఫర్ తీసింది రెండే వికెట్లు. జహీర్‌ ఖాన్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి ఆరు వందలకుపైగా వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జహీర్‌ 2/129 గణాంకాలను తన బెస్ట్‌ బౌలింగ్ ఫిగర్స్‌తో జాఫర్ (2/18) పోల్చి చూసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంది. 2002లో వెస్టిండీస్‌ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్‌లో ఈ గణాంకాలు చోటుచేసుకున్నాయి. ఈ టెస్ట్‌లో భారత జట్టులో 11 మంది ఆటగాళ్లు బౌలింగ్‌ చేయడం మరో విశేషం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని