IND vs NZ: ‘12 రోజులు ముందే వచ్చేశాయా..?’: వసీమ్ జాఫర్ ఫన్నీ పోస్టు

భారత్ - న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య జరిగిన రెండో టీ20 పిచ్‌పై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా (Team India) మాజీ ఆటగాడు జాఫర్ ట్విటర్ వేదికగా స్పందించాడు.

Published : 31 Jan 2023 01:17 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. చివరి మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరగనుంది. అయితే లఖ్‌నవూ పిచ్‌ పూర్తిగా స్పిన్నర్లకు సహకరించడంతో తక్కువ స్కోర్లు నమోదు కావడం గమనార్హం. దీంతో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ తన హాస్య చతురతను ప్రదర్శించాడు. 

ట్విటర్‌ వేదికగా ‘‘12 రోజులు ముందుగానే వచ్చేశామా..?’’ అని లఖ్‌నవూ పిచ్‌, భారత్‌-న్యూజిలాండ్‌, బోర్డర్‌ గావస్కర్ ట్రోఫీని ట్యాగ్‌ చేస్తూ జాఫర్‌ పోస్టు పెట్టాడు. దీంతో సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. ఇలా ఎందుకు పెట్టాడంటే.. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. స్వదేశంలో అనగానే టీమ్‌ఇండియా ఎక్కువగా స్పిన్‌ పిచ్‌లను రూపొందిస్తోందనే అర్థంలో ట్వీట్‌ చేయడం విశేషం. 

అహ్మదాబాద్‌లోనైనా..

తొలి రెండు టీ20ల్లో పిచ్‌ పరిస్థితితో అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైందని జాఫర్‌ తెలిపాడు. అందుకే కీలకమైన చివరి మ్యాచ్‌ జరిగే అహ్మదాబాద్‌లోనైనా మంచి వికెట్‌ను తయారు చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ‘‘అహ్మదాబాద్‌ పిచ్‌ అయినా బాగుంటుందనే నమ్మకం ఉంది. తప్పకుండా మంచి గేమ్‌ అవుతుందని భావిస్తున్నా. లఖ్‌నవూలో మాదిరిగా ఇక్కడా మరీ ఎక్కువగా స్పిన్‌ అయితే ఆశ్చర్యపోవడం అవుతుంది. సాధారణంగా అహ్మదాబాద్‌లో గతంలో చాలా అద్భుతమైన మ్యాచ్‌లను చూశాం. కనీసం ఇక్కడ 170 పరుగుల వరకు స్కోరు చేస్తారని ఆశిస్తున్నా. గత రెండు మ్యాచులతో పోలిస్తే ఇక్కడ కాస్త మెరుగైన ఆటను వీక్షించొచ్చు’’ అని జాఫర్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని