Usain Bolt: ఉసేన్‌ బోల్ట్‌కు షాక్‌.. ఖాతా నుంచి రూ.103కోట్లు మాయం

జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌కు షాక్‌..! ఆయన పెట్టుబడి ఖాతా నుంచి ఏకంగా రూ.103కోట్లు మాయమయ్యాయి.

Updated : 19 Jan 2023 12:48 IST

శాన్‌ జాన్‌ (ప్యూర్టో రికో): ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పరుగులు వీరుడు, జమైకా స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ (Usain Bolt) ఆర్థిక మోసం బారినపడ్డాడు. ఓ ప్రైవేటు పెట్టుబడుల సంస్థలో బోల్డ్‌కు ఉన్న ఖాతా నుంచి ఏకంగా 12.7 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.103కోట్లకు పైమాటే) మాయమయ్యాయి. ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు నేరపూరిత కార్యకలాపాలకు (Financial Scam) పాల్పడి ఈ డబ్బు దోచుకున్నట్లు తెలిసింది.

జమైకా (Jamaica)కు చెందిన స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌) సంస్థలో బోల్ట్‌ (Usain Bolt) కొన్నేళ్ల కిందట ఓ పెట్టుబడి ఖాతా తెరిచాడు. రిటైర్మెంట్‌, లైఫ్‌టైం సేవింగ్స్‌లో భాగంగా ఈ ఖాతాను కొనసాగిస్తున్నాడు. దీనిలో అతడికి 12.8 మిలియన్‌ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి కేవలం 12000 డాలర్ల బ్యాలెన్స్‌ మాత్రమే చూపించిందని బోల్ట్‌ న్యాయవాది వెల్లడించారు. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్య వల్ల డబ్బులు మాయమైనట్లు ఆరోపించారు. పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అతడి న్యాయవాదులు కంపెనీని హెచ్చరించారు.

కాగా.. ఈ మోసాన్ని ఈ నెల ఆరంభంలోనే గుర్తించినట్లు స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ తెలిపింది. ఓ మాజీ ఉద్యోగి మోసపూరిత కార్యకలాపాల కారణంగా తమ క్లయింట్స్‌ ఖాతాల్లో నుంచి మిలియన్‌ డాలర్ల మొత్తం మాయమైనట్లు జనవరి 12న కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉసేన్‌ బోల్ట్‌ సహా దాదాపు 30 మంది ఖాతాదారులు డబ్బులు కోల్పోయినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకొనేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా.. ఈ ఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్‌ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను సూచించారు. ఘటన నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఎల్‌ కంపెనీపై చర్యలు చేపట్టారు. కంపెనీ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను తాత్కాలికంగా ప్రభుత్వ అధికారులు చేతుల్లోకి తీసుకున్నారు.

2008, 2012, 2016 ఒలింపిక్స్‌ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన బోల్ట్‌ (Usain Bolt).. 2017లో అథ్లెటిక్స్‌ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని