ఆ పతకాలు ‘సగం రజతం.. సగం కాంస్యం’

నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్‌ క్రీడల్లో పతకాల కోసం అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. ఎంతమంది క్రీడాకారులు పోటీ పడ్డా కేవలం మొదటి ముగ్గురు వ్యక్తులకే స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. కానీ, గతంలో జరిగిన ఓ ఒలింపిక్‌ క్రీడల్లో జపాన్‌కి చెందిన ఇద్దరు క్రీడాకారులకు

Published : 04 Apr 2021 09:58 IST


(ఫొటో: ఒలింపిక్ ఫేస్‌బుక్‌ వీడియో స్క్రీన్‌షాట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్‌ క్రీడల్లో పతకాల కోసం అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. ఎంతమంది క్రీడాకారులు పోటీ పడ్డా కేవలం మొదటి ముగ్గురు వ్యక్తులకే స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. కానీ, గతంలో జరిగిన ఓ ఒలింపిక్‌ క్రీడల్లో జపాన్‌కి చెందిన ఇద్దరు క్రీడాకారులకు రజత, కాంస్య పతకాలను సగం-సగం చేసి ఇవ్వడంతో ఇద్దరికీ రజత-కాంస్య పతకాలు దక్కాయి. విచిత్రంగా ఉంది కదా..! ఒలింపిక్‌ చరిత్రలో ఇప్పటికీ అదో విశేషం. మరి అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం పదండి..

జర్మనీలోని బెర్లిన్‌ వేదికగా 1936 సమ్మర్‌ ఒలింపిక్‌ ఘనంగా జరిగాయి. ఆగస్టు 1 తేదీ నుంచి 16 వరకు జరిగిన ఈ క్రీడాపోటీల్లో 49 దేశాల నుంచి 3,963 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. పోల్‌ వాల్ట్‌(పోల్‌ జంపింగ్‌) క్రీడా విభాగంలో జపాన్‌ తరఫున సుహీ నిషిదా.. సుయో ఓ పాల్గొన్నారు. అయితే, అమెరికాకు చెందిన క్రీడాకారుడు స్వర్ణ పతకం సాధించగా.. సుహీ, సుయో ఇద్దరు రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఇరువురి మధ్య టై బ్రేకింగ్‌ పోటీ నిర్వహించాలని ఒలింపిక్‌ నిర్వాహకులు నిర్ణయించారు. కానీ, నిషిదా, సుయో ఇందుకు నిరాకరించారు. వారిద్దరు మంచి స్నేహితులు కావడంతో ఒకరినొకరు ఓడించుకోవడం ఇష్టం లేక రెండో స్థానాన్ని నిర్ణయించే పోటీలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. దీంతో  ఒలింపిక్‌ యాజమాన్యం పోల్‌ జంపింగ్‌లో చేసిన ప్రయత్నాల ఆధారంగా నిషిదాకు రెండో స్థానమిచ్చి రజత పతకం, సుయోకి మూడోస్థానం ఇచ్చి కాంస్య పతకం అందజేశారు.

స్నేహానికి గుర్తుగా.. రెండు ముక్కలు చేసి

జపాన్‌ ఒలింపిక్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నిషిదా.. సుయోకి అంతగా రుచించలేదు. దీంతో జపాన్‌కు తిరిగి రాగానే వీరిద్దరి రజత, కాంస్య పతకాలను స్వర్ణకారుడి దగ్గరకు తీసుకెళ్లారు. రెండు పతకాలను సమంగా కోసి.. సగం రజతం, సగం కాంస్యంతో రెండు పతకాలు తయారు చేయించారు. వాటిని చెరొకటి తీసుకున్నారు. వాటినే ప్రస్తుతం ‘ది మెడల్స్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌’ అని పిలుస్తుంటారు. సుయో పతకాన్ని జపాన్‌లోని ఓ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం పెట్టారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని