FIFA World Cup: జర్మనీపై సూపర్‌ విక్టరీ: ‘శుభ్రత’తో జపాన్‌ సెలబ్రేషన్స్‌

నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఘన చరిత్ర ఉన్న జర్మనీని.. ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడి ఒక్కసారి కూడా ప్రిక్వార్టర్స్‌ దాటని జపాన్‌ మట్టికరిపించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఓడించింది.

Published : 24 Nov 2022 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఆటలో ఏ జట్టయినా సంచలన విజయం సాధిస్తే ఆ తర్వాత ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలుతారు. ఇక అభిమానుల సందడైతే సరేసరి..! బాణసంచా పేల్చుతూ వేడుకలు చేసుకుంటారు. కానీ, జపాన్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీపై చారిత్రక విజయం సాధించిన జపాన్‌.. ‘శుభ్రత’తో సంబరాలు చేసుకుంది. అటు స్టేడియంలో జపాన్‌ అభిమానులు చెత్తను తొలగించగా.. ఆ దేశ ఆటగాళ్లు తమ లాకర్ గదిని శుభ్రం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఘన చరిత్ర ఉన్న జర్మనీని.. ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడి ఒక్కసారి కూడా ప్రిక్వార్టర్స్‌ దాటని జపాన్‌ మట్టికరిపించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఓడించింది. ఈ సంచలన విజయంతో మైదానంలో జపాన్‌ ఆటగాళ్లు, స్టాండ్స్‌లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ అది కొద్దిసేపే. ఖలీఫా స్టేడియం నుంచి లాకర్‌ గదికి వెళ్లగానే జపాన్‌ జట్టు ఆటగాళ్లు తమ పనిలో నిమగ్నమయ్యారు. లాకర్‌ గదిలో హ్యాంగర్లకు వేసిన దుస్తులను, టవళ్లను మడిచి శుభ్రంగా సర్దిపెట్టారు. అంతేకాదు.. ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెబుతూ ‘థ్యాంక్యూ’ నోట్‌ కూడా రాసిపెట్టారు. ఈ ఫోటోను ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఫిఫా.. ‘థ్యాంక్యూ సోమచ్‌’ అంటూ జపాన్‌ జట్టు మంచి మనసును అభినందించింది.

అటు నిన్నటి మ్యాచ్‌ అనంతరం జపాన్‌ ప్రేక్షకులు కూడా మైదానం స్టాండ్స్‌లో చెత్తను తొలగించారు. ప్రేక్షకులు వాడి పారేసిన నీళ్లు, శీతల పానీయాల సీసాలు, ఆహార పదార్ధాల కవర్లు.. ఇలా అక్కడి చెత్తను ఏరి మైదాన సిబ్బందికి సాయం చేశారు. ఇతరులు అక్కడే వదిలి వెళ్లిపోయిన జాతీయ పతాకాలనూ గౌరవంగా తీసి పక్కనపెట్టారు. ఈ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లోనూ జపాన్‌ అభిమానులు స్టాండ్స్‌ను శుభ్రం చేసి మంచి మనసు చాటుకున్నారు.జపాన్‌ అంటేనే పరిశుభ్రతకు, క్రమశిక్షణకు మారుపేరు. అక్కడ రోడ్లపై ఎలాంటి చెత్తా కనిపించదు. ఒక వేళ కనిపిస్తే ప్రజలు వెంటనే వాటిని తీసి డస్ట్‌బిన్స్‌లో వేస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని