Jason Holder: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. హోల్డర్ చారిత్రక ప్రదర్శన

వెస్టిండీస్‌ పేసర్‌ జేసన్‌ హోల్డర్‌ చారిత్రక ప్రదర్శన చేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో చివరి ఓవర్‌లో అతడు వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు...

Updated : 31 Jan 2022 10:26 IST

ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్‌ సిరీస్‌ విజయం

(Photo: ICC Twitter)

బార్బోడాస్‌: వెస్టిండీస్‌ పేసర్‌ జేసన్‌ హోల్డర్‌ చారిత్రక ప్రదర్శన చేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో చివరి ఓవర్‌లో అతడు వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో కరీబియన్‌ జట్టుకు 3-2 తేడాతో సిరీస్‌ అందించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 179/4 స్కోర్‌ చేయగా.. అనంతరం ఇంగ్లాండ్‌ 19 ఓవర్లకు 160/6 స్కోర్‌తో నిలిచింది. అయితే, చివరి ఓవర్‌లో విజయానికి 20 పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లాండ్‌ మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. అప్పటికే క్రీజులో కుదురుకున్న సామ్‌ బిల్లింగ్స్‌ (40; 26 బంతుల్లో 1x4, 2x6), క్రిస్‌జోర్డాన్‌ (7;8 బంతుల్లో 1x4) చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉండగా విండీస్‌ సారథి పొలార్డ్‌ బంతిని హోల్డర్‌కు అందించాడు.

యితే, అతడు వేసిన తొలి బంతికి సామ్‌ సింగిల్‌ తీయగా.. అది నోబాల్‌గా నమోదైంది. దీంతో ఫ్రీ హిట్‌ లభించింది. కానీ, తర్వాతి బంతికి జోర్డాన్‌ పరుగులేమీ చేయలేకపోయాడు. ఆపై హోల్డర్‌ రెచ్చిపోయి బౌలింగ్‌ చేయగా.. ఇంగ్లాండ్‌ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి జోర్డాన్‌, మూడో బంతికి సామ్‌ బిల్లింగ్స్‌(41), నాలుగో బంతికి అదిల్‌ రషీద్‌(0), ఐదో బంతికి షకీబ్‌ మహమూద్‌(0) ఔటయ్యారు. ఈ క్రమంలోనే హోల్డర్‌.. విండీస్‌ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. కాగా, టీ20ల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడంతో హోల్డర్‌ ఈ జాబితాలో నాలుగో ఆటగాడిగా చేరాడు. ఇంతకుముందు శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగా, ఐర్లాండ్‌ బౌలర్‌ కర్టిస్‌ కాంఫర్‌, అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఈ ఘనత సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు