Jasprit Bumrah: టీ20 క్రికెట్‌లో జస్ప్రిత్‌ బుమ్రా అరుదైన రికార్డు

టీమ్‌ఇండియా, ముంబయి ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అటు అంతర్జాతీయ టీ20ల్లో, ఇటు భారత టీ20 క్రికెట్‌లో మొత్తం 250 వికెట్లు పడగొట్టాడు...

Published : 19 May 2022 02:25 IST

(Photo: Jasprit Bumrah Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, ముంబయి ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అటు అంతర్జాతీయ టీ20ల్లో, ఇటు భారత టీ20 క్రికెట్‌లో మొత్తం 250 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్‌ చివరి బంతికి బుమ్రా.. వాషింగ్టన్‌ సుందర్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో పొట్టి క్రికెట్‌లో అతడు మొత్తం 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అతడి తర్వాత హైదరాబాద్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 223 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా జయదేవ్‌ ఉనద్కత్‌ 201 వికెట్లతో మూడు, మాజీ పేసర్‌ వినయ్‌ కుమార్‌ 194 వికెట్లు సాధించి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

బుమ్రాను అధిగమించిన ఉమ్రాన్‌

(Photo: Umran Malik Instagram)

మరోవైపు హైదరాబాద్‌ యువ పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ ఇదే మ్యాచ్‌లో బుమ్రాకు చెందిన ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి 20 ఓవర్ల పూర్తికోటా ఆడి 190/7 పరుగులకు పరిమితమైంది. దీంతో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఉమ్రాన్‌ ఆ జట్టులోని 3 కీలక వికెట్లు తీసి హైదరాబాద్‌ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (43)తో పాటు ప్రమాదకర డేనియల్‌ సామ్స్‌ (15), తిలక్‌ వర్మ(8)లను వెనక్కి పంపాడు. దీంతో అతడు ఈ సీజన్‌లో మొత్తం 21 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ భారత టీ20 టోర్నీలో 2017 సీజన్‌లో పిన్న వయస్కుడిగా బుమ్రా (20) తీసిన అత్యధిక వికెట్ల రికార్డును ఉమ్రాన్‌ అధిగమించాడు.

* ఉమ్రాన్‌ మాలిక్‌ - 22 ఏళ్ల 176 రోజుల్లో 21 వికెట్లు (2022)

* జస్ప్రిత్‌ బుమ్రా - 23 ఏళ్ల 165 రోజుల్లో 20 వికెట్లు  (2017)

* ఆర్పీ సింగ్‌ - 23 ఏళ్ల 166 రోజుల్లో 23 వికెట్లు (2009)

* ప్రజ్ఞాన్‌ ఓజా - 23 ఏళ్ల 225 రోజుల్లో 21 వికెట్లు (2010)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని