Jasprit Bumrah: అక్కడే మొదలెట్టాడు.. అక్కడే కొత్త చరిత్ర సృష్టిస్తాడా?

టీమ్‌ఇండియా బౌలింగ్ చరిత్రలో జస్ప్రిత్‌ బుమ్రాది ప్రత్యేక అధ్యాయం. జట్టులోకొచ్చిన అనతికాలంలోనే ప్రపంచ శ్రేణి పేసర్‌గా ఎదిగాడు. ఆడిన 26 టెస్టుల్లో 107 వికెట్లు పడగొట్టి నంబర్ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు...

Published : 10 Jan 2022 11:58 IST

కేప్‌టౌన్‌తో బుమ్రా ప్రత్యేక అనుబంధం..

టీమ్‌ఇండియా బౌలింగ్ చరిత్రలో జస్ప్రిత్‌ బుమ్రాది ప్రత్యేక అధ్యాయం. జట్టులోకొచ్చిన అనతికాలంలోనే ప్రపంచ శ్రేణి పేసర్‌గా ఎదిగాడు. ఆడిన 26 టెస్టుల్లో 107 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ప్రశాంతంగా ఉంటూ యార్కర్లతో ప్రత్యర్థులను బోల్తాకొట్టించే అతడు ఇప్పుడు కేప్‌టౌన్‌లో అడుగుపెట్టాడు. నాలుగేళ్ల కిందట ఇదే మైదానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ పేస్‌గుర్రం ఇప్పుడు మరోసారి అక్కడ సత్తా చాటాలని చూస్తున్నాడు.

కేప్‌టౌన్‌లో మొదలెట్టి..

బుమ్రా 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసి 4 వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా మిస్టర్‌ 360గా పేరు గాంచిన ఏబీ డివిలియర్స్ (65) లాంటి దిగ్గజాన్ని తొలి ఇన్నింగ్స్‌లో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో తన టెస్టు కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ మరోసారి డివిలియర్స్‌(35)తో సహా నాటి కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ (0), క్వింటన్‌ డికాక్‌ (8) లాంటి కీలక ఆటగాళ్లను కూడా పెవిలియన్‌ పంపాడు. ఆపై సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అతడు.. జోహానెస్‌బర్గ్‌లో ఆడిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలిసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో మరో 2 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు సాధించాడు.

తగ్గేదేలే అన్నట్లు.. 

అలా తొలి పర్యటనలోనే విదేశీ పిచ్‌పై అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడు తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈసారి అక్కడ టీమ్‌ఇండియా ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగింటిలో ఓటమిపాలవ్వగా ఒక్క టెస్టులో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో. అందులోనే ఈ టీమ్ఇండియా పేసర్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లో రెండోసారి సాధించిన ఘనతగా నిలిచింది. ఈ సిరీస్‌లో మరో 13 వికెట్లు తీసిన అనంతరం ఆస్ట్రేలియా పర్యటననకు వెళ్లాడు. అక్కడా బుమ్రా మాయ చేశాడు. బాక్సింగ్‌ డే టెస్టులో ఈసారి 6 వికెట్లు తీసి కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇక ఈ సిరీస్‌లో మొత్తం 21 వికెట్లు పడగొట్టి ఒకే ఏడాది మొత్తం 48 వికెట్లు సాధించాడు. మరోవైపు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా గడ్డలపై ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 5 వికెట్లు తీసిన తొలి ఆసియా పేసర్‌గానూ రికార్డులకెక్కాడు.

విదేశాల్లో నంబర్‌ వన్‌..

ఇక 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ తర్వాత బుమ్రా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆడిన తొలి టెస్టులోనే మరో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 5/7 సంచలన బౌలింగ్‌ చేశాడు. ఇక తర్వాత అదే పర్యటనలో ఆడిన  రెండో టెస్టులో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించి.. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు పుటల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే విదేశాల్లో వరుసగా 17 టెస్టులు ఆడిన తర్వాత బుమ్రా తొలిసారి గతేడాది ఫిబ్రవరిలో భారత్‌లో తొలి టెస్టు ఆడాడు. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో డానియల్‌ లారెన్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా భారత్‌లో తొలి టెస్టు వికెట్ సాధించాడు. ఇక ఇప్పటివరకు ఈ టీమ్‌ఇండియా పేసర్‌ మొత్తం 26 టెస్టులు ఆడగా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే భారత్‌లో ఆడాడు. మిగిలినవన్నీ విదేశాల్లోనే కావడం గమనార్హం. దీంతో భారత్‌ తరఫున బుమ్రా ప్రధాన విదేశీ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు కేప్‌టౌన్‌లోనే జరుగుతుండటంతో తన కెరీర్‌ ప్రారంభమైన మైదానంలోనే మరోసారి మేటి ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియాకు చారిత్రక విజయం అందించేందుకు తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన తొలి టెస్టు తీపి గుర్తులు గుర్తొస్తున్నాయని పోస్టు చేశాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని