Bumrah: వరల్డ్‌ కప్‌ నుంచి ఔట్.. విమర్శలకు బుమ్రా కౌంటర్‌

నెట్టింట్లో ట్రోలింగ్‌ గురవుతున్న టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా.. విమర్శలకు సూపర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. పొట్టి ప్రపంచకప్‌ నుంచి దూరం కావడంపై ఇప్పటికే బుమ్రా స్పందించిన విషయం తెలిసిందే.

Published : 06 Oct 2022 14:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌ అయిన విషయం తెలిసిందే. జాతీయ జట్టు తరఫున పట్టుమని నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోతున్న బుమ్రా.. భారత టీ20 లీగ్‌లో మాత్రం అన్ని మ్యాచ్‌లూ ఆడేందుకు మాత్రం ఫిట్‌నెస్‌, గాయాలు అడ్డు రావడం లేదని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తూర్పారబట్టారు. వెన్ను నొప్పి కారణంగా ఆసియా కప్‌ల బరిలోనూ దిగలేకపోయిన బుమ్రా ఆసీస్‌తో మాత్రమే టీ20 సిరీస్‌ ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీ క్రికెట్‌కు అందుబాటులో ఉండే బుమ్రా టీమ్‌ఇండియా కోసం మాత్రం గాయాలను సాకుగా చూపి తప్పించుకొంటున్నాడని విమర్శలు వచ్చాయి. అయితే వాటికి కౌంటర్‌గా బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

‘‘మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే నువ్వు నీ గమ్యస్థానానికి ఎప్పటికీ చేరుకోలేవు’’ అని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశాడు. ఇది  యూకే మాజీ ప్రధాని విన్‌స్టల్ చర్చిల్ ప్రసిద్ధిగాంచిన కొటేషన్. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ నుంచి బుమ్రా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బుమ్రా కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. పొట్టి ప్రపంచకప్‌ జట్టులో భాగం కాలేకపోవడం భావోద్వేగానికి గురి చేసిందని, అయితే గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ బుమ్రా ట్వీట్ చేశాడు. బుమ్రా గైర్హాజరీతో వరల్డ్‌ కప్‌ ప్రధాన జట్టులోకి ఆటగాడి పేరును బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని