IND vs SA: వ్యక్తిగత ప్రదర్శన కన్నా జట్టు గెలిచినప్పుడే సంతృప్తి: బుమ్రా

వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టు గెలిచినప్పుడే ఎక్కవ సంతృప్తి కలుగుతుందని టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా అన్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు...

Published : 13 Jan 2022 10:18 IST

కేప్‌టౌన్‌: వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టు గెలిచినప్పుడే ఎక్కువ సంతృప్తి కలుగుతుందని టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా అన్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ పేస్‌గుర్రం ఐదు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు 210 పరుగులకే ఆలౌటవ్వడంలో బుమ్రా కీలక పాత్రపోషించాడు. దీంతో భారత్‌ 13 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 223 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 57/2తో నిలిచింది. పుజారా (9), కోహ్లీ (14) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇక రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బుమ్రా.. తన సారథి విరాట్‌కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. పేస్‌బౌలర్లకు అండగా నిలుస్తాడని, వారిలో ఎప్పుడూ ఉత్సాహం నింపుతాడని చెప్పాడు. జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాడని తెలిపాడు. అతడి సారథ్యంలో ఆడటం బాగుంటుందని బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ కేప్‌టౌన్‌ మైదానంలో ఆడటం తనకు మరింత ప్రత్యేకమని చెప్పాడు. 2018లో కోహ్లీ సారథ్యంలోనే తాను ఇదే వేదికపై తొలి టెస్టు ఆడినట్లు గుర్తుచేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇదే మైదానంలో ఐదు వికెట్లు పడగొట్టడం ప్రత్యేకంగా ఉందన్నాడు. అయితే, వ్యక్తిగత ఆటతీరు బాగున్నా అవి జట్టు విజయానికి కృషి చేసినప్పుడే మరింత సంతోషకరంగా ఉంటుందని టీమ్‌ఇండియా పేసర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని