IND vs SA: టీమ్‌ఇండియాకు పేస్ బౌలింగే ప్రధాన బలం

సీనియర్లు, జూనియర్ల కలయికతో ప్రస్తుతం టీమ్‌ఇండియా పేస్ దళం పటిష్టంగా ఉందని, అదే భారత జట్టుకు ప్రధాన బలమని మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ అన్నాడు. అందుకే ఇటీవల కాలంలో విదేశీ

Updated : 22 Dec 2021 10:08 IST

మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌

ఇంటర్నెట్ డెస్క్: సీనియర్లు, జూనియర్‌ ఆటగాళ్లతో ప్రస్తుతం టీమ్‌ఇండియా పేస్ దళం పటిష్ఠంగా ఉందని, అదే భారత జట్టుకు ప్రధాన బలమని మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ అన్నాడు. అందుకే ఇటీవల కాలంలో భారత్ విదేశీ పిచ్‌లపై కూడా ఆదిపత్యం చెలాయిస్తోందని పేర్కొన్నాడు.

‘సీనియర్‌, జూనియర్‌ ఆటగాళ్ల కలయికతో ప్రస్తుతం టీమ్‌ఇండియా పేస్‌ విభాగం చాలా పటిష్ఠంగా ఉంది. వాళ్లు విదేశీ పిచ్‌లపై కూడా నిలకడైన ప్రదర్శన చేస్తున్నారు. ప్రతి టెస్టులో 20 వికెట్లు తీస్తున్నారు. వారి బౌలింగ్‌లో కావాల్సినంత వైవిధ్యం ఉంది. సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్ శర్మ తన పొడుగుని ఉపయోగించుకుని.. అదనపు బౌన్స్‌ రాబట్టగలడు. మహమ్మద్‌ షమి కూడా బౌన్సీ పిచ్‌లపై చక్కటి సీమ్‌ రాబట్టగలడు. శార్దూల్ ఠాకూర్‌, మహమ్మద్ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌ కూడా మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కి కలిసొచ్చే అంశం. అలాగే, జట్టులో ఒక్క ఎడమ చేతి వాటం బౌలర్‌ ఉంటే బాగుండేది. జస్ప్రీత్ బుమ్రా లాంటి వైవిధ్యమైన బౌలర్‌ ఉండటం టీమ్‌ఇండియాకు కలిసొస్తుంది. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. అతడో ప్రపంచ స్ధాయి బౌలర్’ అని జహీర్ ఖాన్‌ పేర్కొన్నాడు.

* బుమ్రాతోనే దక్షిణాఫ్రికాకు ప్రమాదం : డీన్‌ ఎల్గర్‌

మరోవైపు, దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ కూడా జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. అతడో ప్రపంచ స్థాయి బౌలర్‌ అని.. దక్షిణాఫ్రికా జట్టుకు అతడితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం భారత బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా నుంచి మాకు ప్రమాదం పొంచి ఉంది. అయితే, మేం అతడి ఒక్కడి మీదే కాకుండా మిగతా బౌలర్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మా జట్టుతో పోల్చుకుంటే భారత జట్టు మెరుగ్గా ఉంది. కొత్త ఆటగాళ్లతోనే భారత్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం’ అని డీన్ ఎల్గర్ పేర్కొన్నాడు. 

డిసెంబరు 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు సిరీస్‌ నిర్వహించనున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని