IND vs AUS: ‘‘ఆసీస్‌పై యార్కర్లను చూస్తాం.. బుమ్రా నాలుగు ఓవర్లే అత్యంత కీలకం’’

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 పోరులో భారత్‌ ఆసీస్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ ఆస్ట్రేలియాతోపాటు మనకూ ముఖ్యమే.

Updated : 24 Jun 2024 14:23 IST

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి కప్‌లో (T20 World Cup 2024) చావోరేవో లాంటి మ్యాచ్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. సూపర్‌-8 పోరులో భాగంగా ఆసీస్‌తో భారత్ (IND vs AUS) తలపడనుంది. ఈ క్రమంలో కంగారూల జట్టును అడ్డుకోవడంలో జస్‌ప్రీత్ బుమ్రా ఓవర్లే కీలకంగా మారతాయని భారత మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా వ్యాఖ్యానించాడు. బుమ్రాపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ కాలింగ్‌వుడ్‌ ప్రశంసలు కురిపించాడు. 

‘‘ఈసారి ప్రపంచకప్‌లో ఇతర జట్లకు, భారత్‌కు బుమ్రానే (Jasprit Bumrah) వ్యత్యాసం. ప్రతీ టీమ్‌లోనూ ఇలాంటి ఆటగాడు ఉండాలని కోరుకోవడం సహజం. వికెట్లను తీయడంతోపాటు ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆసీస్‌పైనా బుమ్రా వేసే నాలుగు ఓవర్లే అత్యంత కీలకం కానున్నాయి. అతడిని గౌరవిస్తేనే ఆసీస్‌కు ఏమైనా అవకాశం ఉంటుంది’’ అని కాలింగ్‌వుడ్‌ తెలిపాడు. 

ఎప్పుడైనా వందశాతం ఇస్తాడు: చావ్లా

‘‘ఎప్పుడు మైదానంలోకి దిగినా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాడు. యూఎస్‌లో ఇప్పటికే అతడి బౌలింగ్‌ను చూశాం. ఇప్పుడు కరేబియన్‌లోనూ స్పిన్నర్లకు సహకారం లభించే పిచ్‌లపై బుమ్రా తన ప్రభావం చూపించాడు. బంగ్లాదేశ్‌పై అతడి అస్త్రం యార్కర్లనే పెద్దగా ప్రయోగించలేదు. ఈసారి మాత్రం ఆసీస్‌పై సంధించే అవకాశాలు ఎక్కువే’’ అని చావ్లా (Piyush Chawla) వ్యాఖ్యానించాడు. 

ఇప్పుడు గెలిస్తే.. సెమీస్‌ ఇంగ్లాండ్‌తోనే

ఆసీస్‌పై భారత్ విజయం సాధిస్తే సెమీస్‌కు దూసుకోపోవడంతోపాటు అగ్రస్థానంతో సూపర్‌-8ను (T20 World Cup Super-8) ముగిస్తుంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంటుంది. గ్రూప్‌-2లో దక్షిణాఫ్రికా, ఇంగ్లిష్‌ జట్టు సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్‌ చేతిలో ఆసీస్‌ ఓడితే నాకౌట్‌ అవకాశం దెబ్బతింటుంది. బంగ్లాదేశ్‌పై అఫ్గాన్ (AFG vs BAN) విజయం సాధిస్తే మాత్రం కంగారూల జట్టు ఇంటిముఖం పట్టక తప్పదు. వర్షం ముప్పు ఉంటుందనే వార్తలు కూడా ఆసీస్‌ అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. కీలకమైన పోరులో కంగారూల జట్టును తక్కువగా అంచనా వేయకూడదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు