Jasprit Bumrah: చాలా విమర్శలొస్తాయి.. అయినా పట్టించుకోను: బుమ్రా

బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని ముంబయి పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా అన్నాడు. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో...

Published : 11 May 2022 02:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని ముంబయి పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా అన్నాడు. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో (10/5) అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన అతడు.. కోల్‌కతాను 165/9 స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కమ్రంలోనే ఈ లీగ్‌లో తొలిసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అలాగే ఈ టోర్నీ మొత్తంలో ఐదో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గానూ నిలిచాడు. దీంతో ఇప్పుడు అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు బుమ్రా ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 5 వికెట్లే తీశాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సరిగ్గా బౌలింగ్‌ చేయట్లేదని, తన స్థాయికి తగిన ప్రదర్శన చేయట్లేదనే మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజా ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన బుమ్రా ఇలా స్పందించాడు. ‘మేం ఎలా సన్నద్ధమవ్వాలో కచ్చితమైన ప్రణాళికలు మాకున్నాయి. మాకు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆలోచించం. మా పని మేం చేసామా లేదా అనేదే పరిగణనలోకి తీసుకుంటాం. మీరు ఆటను అర్థం చేసుకుంటే.. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆట ఎలా సాగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయి. బౌలింగ్‌ ఎలా చేస్తున్నామనే విషయాలు అర్థమవుతాయి. ఇక వ్యక్తిగతంగా నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

‘బయట నుంచి చాలా విమర్శలొస్తాయనే సంగతి నాకూ తెలుసు. అవేమీ నన్ను ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు.. నిపుణులు ఏం చెప్తున్నారు.. అనే విషయాలను బట్టి నా పనితీరును అంచనా వేసుకునే వ్యక్తిని కాదు. వాటిని అస్సలు పట్టించుకోను. నాకు నా వ్యక్తిగత ప్రదర్శనే ముఖ్యం. అందుకు నన్ను నేనే ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటా. నా ప్రణాళికల పరంగా సన్నద్ధమవుతున్నానా లేదా అనే విషయాలనే ఆలోచిస్తా. వీలైనంత మేర జట్టుకు ఎలా ఉపయోగపడలనే కోరుకుంటా. నేను ఇలాగే ఆడతా. ఎప్పటికీ ఇలాగే కొనసాగుతా’ అని బుమ్రా వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని