IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భారత్‌ విజయం.. నమోదైన రికార్డులివీ.!

ఇటీవల కాలంలో టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2021-22 సీజన్‌లో సొంత గడ్డపై జరిగిన ఒక్క సిరీస్‌లోనూ భారత జట్టు ఓటమెరుగకుండా ముందుకు సాగుతోంది. నాలుగు టెస్టుల్లో.. మూడింట్లో..

Published : 15 Mar 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇటీవల కాలంలో టీమ్‌ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. 2021-22 సీజన్‌లో సొంత గడ్డపై జరిగిన ఒక్క సిరీస్‌లోనూ భారత జట్టు ఓటమెరుగకుండా ముందుకు సాగుతోంది. నాలుగు టెస్టుల్లో.. మూడింట్లో విజయం సాధించి.. ఒక మ్యాచును డ్రా గా ముగించింది. శ్రీలంకతో జరిగిన పింక్‌బాల్ టెస్టులో గెలుపొందడం ద్వారా.. భారత్‌ సొంతగడ్డపై వరుసగా 15వ టెస్టు విజయం నమోదు చేసింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో 3 వన్డేలు, 9 టీ20 మ్యాచుల్లో గెలుపొందింది.

అలాగే, టీమ్‌ఇండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ కూడా అరుదైన ఘనత నెలకొల్పాడు. వరుసగా ఐదు సిరీసుల్లో విజయం సాధించాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌, ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు, తాజాగా శ్రీలంకతో టీ20, టెస్టు సిరీసుల్లో విజయం సాధించడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు.

* పింక్‌బాల్ టెస్టులో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన..

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్‌బాల్ (డే/నైట్‌) టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద పింక్‌బాల్ టెస్టులో 8/47 గణాంకాలు నమోదు చేశాడు.

* డేల్ స్టెయిన్‌ను అధిగమించిన అశ్విన్‌..

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ టెస్టు సిరీస్‌లో అరుదైన ఘనతలు సాధించాడు. టెస్టుల్లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ (434 వికెట్లు) రికార్డును అధిగమించాడు. తాజాగా, జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్‌ డేల్ స్టెయిన్‌ (439 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం అశ్విన్‌ ఖాతాలో 442 వికెట్లున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని