Bumrah - Smriti Mandhana: బుమ్రా, స్మృతి మంధానకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు

జూన్‌ నెలకుగాను పురుషుల విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహిళల విభాగంలో స్మృతి మంధాన ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డులు దక్కించుకున్నారు. 

Updated : 09 Jul 2024 18:33 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్ 2024 టీ20 ప్రపంచ కప్‌ సాధించడంలో జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)  కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. మొత్తం 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అతడిని మరో అవార్డు వరించింది. బుమ్రా జూన్‌ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. ‘‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు సంతోషిస్తున్నాను. యూఎస్‌, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో చిరస్మరణీయమైన ప్రదర్శన చేసిన తర్వాత దక్కిన ప్రత్యేక గౌరవమిది. మేము జట్టుగా సెలబ్రేట్ జరుపుకోవడానికి చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా ఈ అవార్డు నా ఖాతాలో చేరడంతో ఆనందంగా ఉంది’’ అని బుమ్రా అన్నాడు. 

మహిళల విభాగంలో మంధాన 

మహిళల విభాగంలో కూడా భారత క్రికెటర్‌కే ఈ అవార్డు దక్కింది. భారత మహిళల జట్టు వైస్‌ కెప్టన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కూడా జూన్‌ నెలకుగాను ‘ఉమెన్స్ ప్లేయర్‌ ఆఫ్ ది మంత్‌’ అవార్డు అందుకుంది. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో మంధాన ప్రధాన పాత్ర పోషించింది. సఫారీలపై తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన మంధాన మూడో వన్డేలో త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకుంది. ‘‘జూన్ నెలలో ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డును గెలుచుకున్నందుకు, జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మేం మా ఫామ్‌ని కొనసాగిస్తామని ఆశిస్తున్నా. భారత్‌ మరిన్ని మ్యాచ్‌ల్లో గెలవడానికి కృషి చేస్తాను’’ అని స్మృతి మంధాన పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని