T20 League : ఇక నుంచి భారత టీ20 లీగ్‌ 75 రోజులు.. మ్యాచ్‌లు పెరిగే అవకాశం!

 వచ్చే ఏడాది నుంచి భారత టీ20 లీగ్‌ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా బీసీసీఐ తన చర్యలను...

Updated : 29 Jun 2022 14:25 IST

చర్చలు జరుపుతున్నామన్న బీసీసీఐ కార్యదర్శి జై షా

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఏడాది నుంచి భారత టీ20 లీగ్‌ను 75 రోజులపాటు (రెండున్నర నెలలు) నిర్వహించేలా బీసీసీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ ఆటగాళ్లు పాల్గొనే లీగ్‌ను మరో రెండు వారాలు అదనంగా నిర్వహించనుంది. ఇప్పటికిప్పుడు మరిన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని జై షా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రకారం పది జట్లతోనే నిర్వహిస్తామన్నాడు.

‘‘భారత టీ20 లీగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతోపాటు ఇతర దేశాల క్రికెట్‌ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది టీ20 లీగ్‌ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా ఐసీసీ క్యాలెండర్‌లోనూ అవకాశం కల్పిస్తాం. టాప్‌ ఆటగాళ్లు తప్పకుండా హాజరవుతారు. అదేవిధంగా టీ20 లీగ్‌ను విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతూనే ఉంటాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం’’ అని జై షా తెలిపారు. 

ఇప్పటి వరకు టీ20 లీగ్‌లో రెండు నెలలపాటు 74 మ్యాచ్‌లను నిర్వహించేవారు. ఇక  రెండున్నర నెలలపాటు నిర్వహిస్తే మాత్రం మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ భారీ మొత్తం దక్కించుకొంది. అలాగే 2024-2031 భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణను నిర్దేశించడానికి ఐసీసీ గవర్నింగ్‌ కౌన్సిల్ వచ్చే నెలలో సమావేశం కానుంది. ఈ క్రమంలో అనుబంధ దేశాలతోపాటు టాప్‌ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడేలా సమగ్రమైన క్యాలెండర్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని జై షా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని