Team India: జరగాల్సినప్పుడే జరుగుతుంది 

తనకు అవకాశాలు రావాల్సినప్పుడే వస్తాయని టీమ్‌ఇండియా, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున 67 వికెట్లతో అదరగొట్టిన అతడు జట్టును తొలిసారి విజేతగా నిలిపాడు...

Published : 13 Jun 2021 15:15 IST

టీమ్‌ఇండియా క్రికెటర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: తనకు అవకాశాలు రావాల్సినప్పుడే వస్తాయని టీమ్‌ఇండియా, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున 67 వికెట్లతో అదరగొట్టిన అతడు జట్టును తొలిసారి విజేతగా నిలిపాడు. అయినా బీసీసీఐ సెలెక్టర్లు అతనిని ఇంగ్లాండ్‌ పర్యటనలో లేదా శ్రీలంక పర్యటనలోనూ ఎంపిక చేయలేదు. ఈ క్రమంలోనే గతరాత్రి సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చేసిన అతడు ఈ విధంగా స్పందించాడు.

‘నేను చిన్నప్పుడే క్రికెట్‌ను ప్యాషన్‌గా ఎంచుకున్నా. ఇక్కడ ఎంతో మంది దిగ్గజాలు మైదానంలో మనసు పెట్టి ఆడటం చూసి వారినుంచి స్ఫూర్తి పొందా. ఇప్పుడు నేను క్రికెటర్‌గా కొనసాగుతున్నా. అన్నింటికీ మించి వాళ్లను చూసి ఎప్పుడూ నిరాశ  చెందకూడదని నన్ను నేను తయారుచేసుకున్నా. అయితే, యువ క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో కొందరు నన్ను పరిణతి చెందని బౌలర్‌గా చూసేవారు. తర్వాత మెల్లగా నేను మారాక వాళ్ల అలోచనా విధానం మారింది. అలా పరిణతి చెందాను. కెరీర్‌లో ఒడుదొడుకులు చూశాను. ఈ ఆటే లేకపోతే ఎలా ఉండేదో’ అని ఉనద్కత్‌ పేర్కొన్నాడు.

క్రికెట్‌ తనకు చాలా ఇచ్చిందని, ఒక్కసారి అవకాశం రానంత మాత్రాన తనని ఎందుకు తీసుకోలేదని ఆవేదన చెందనని ఉనద్కత్‌ వివరించాడు. గతంలో తనకు అవకాశాలొచ్చాయని, భవిష్యత్‌లోనూ రావాల్సిన సమయంలో వస్తాయని సౌరాష్ట్ర పేసర్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన కెరీర్‌ ఉన్న పరిస్థితుల్లో.. సంపాదించుకున్న అనుభవంతో.. తనకు అందివచ్చే అవకాశాలనే స్వీకరిస్తానని ఆ విషయంలో చివరివరకు కష్టపడతానని ఈ ఫాస్ట్‌బౌలర్‌ పేర్కొన్నాడు. తనకు అవకాశాలు వచ్చినప్పుడే మైదానంలో చెలరేగుతానని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నాడు. కాగా, 2010 నుంచీ ఐపీఎల్‌లో ఆడుతున్న జయదేవ్‌ ఇప్పటివరకు టీమ్‌ఇండియాలో ఒక టెస్టు, ఏడు వన్డేలు, పది టీ20లు ఆడాడు. 2018లో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఇక అప్పటినుంచి మళ్లీ టీమ్‌ఇండియా పిలుపుకోసం ఎదురు చూస్తున్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts