Jemimah Rodrigues : ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీ సరసన నేనూ చేరిపోయా: రోడ్రిగ్స్‌

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా రజత పతకం నెగ్గిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో జరిగిన..

Published : 17 Aug 2022 11:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా రజత పతకం నెగ్గిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, స్మృతీ మంధానతోపాటు మరొక బ్యాటర్‌ ఈ టోర్నీలో ఆకట్టుకుంది. భారత్‌ ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ప్రాతినిధ్యం వహించిన జెమీమా రోడ్రిగ్స్‌ 73 సగటుతో 146 పరుగులు చేసింది. అందులో ఒక అర్ధశతకం ఉంది. మూడుసార్లు నాటౌట్‌గా నిలిచింది. మరిప్పుడు వార్తల్లోకి ఎందుకు నిలిచిందనేగా మీ సందేహం..

ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో రోడ్రిగ్స్ (44 నాటౌట్) చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి భారత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇక్కడే స్టంపౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. కాస్త ముందుకెళ్లి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రోడ్రిగ్స్‌.. తన కాళ్లను మాత్రం క్రీజ్‌ను వదలనీయలేదు. దానికి సంబంధించిన ఫొటోను తాజాగా తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. గతంలో టీమ్‌ఇండియా మాజీ సారథులు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా ఇలానే క్రీజ్‌ను వదలకుండా చేసిన ఫీట్‌ ఫొటోలను జత చేసింది. ‘‘నేను కూడా ప్రత్యేకమైన విభాగంలో చేరినట్లు అనిపిస్తోంది’’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు తమ కామెంట్లతో విజృంభించారు. ‘ఇద్దరు దిగ్గజాల కంటే నువ్వే కాస్త క్రీజ్‌ లోపలికి ఉన్నావు’’ అని సరదాగా కామెంట్లు పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని