Asian Games: క్రికెట్‌లో మేం గోల్డ్‌ సాధించాం.. ఇక మీ వంతు: జెమీమా రోడ్రిగ్స్‌

ఆసియా క్రీడల్లో (Asian Games) స్వర్ణ పతకం గెలిచి భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో లంకను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Published : 26 Sep 2023 10:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళా క్రికెటర్లు (Womens Cricket Team) అద్భుతం చేశారు. ఆసియా క్రీడల్లో (Asian Games) స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఫైనల్‌లో శ్రీలంకను(INDw vs SLw) కట్టడి చేసి విజయం సాధించారు. ఈ టోర్నీలో జెమీమా రోడ్రిగ్స్‌ టాప్‌ స్కోరర్‌. ఆమె మూడు మ్యాచుల్లో 109 పరుగులు చేసింది. ఫైనల్‌లోనూ 42 పరుగులతో ఆకట్టుకుంది. గోల్డ్ మెడల్‌ అందుకున్న తర్వాత జెమీమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత పురుషుల జట్టుకూ ఓ సందేశం ఇచ్చింది. ‘‘ ఇక మనం పురుషుల క్రికెట్‌ జట్టు గురించి మాట్లాడుకుందాం. వారికి ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడు మేం స్వర్ణం గెలిచాం. ఇక మీ వంతు. మీరు కూడా గోల్డ్‌ మెడల్‌ తీసుకురావాలి’’ అని పేర్కొంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 116 పరుగులే చేయగలిగింది. అయితే, తితాస్ సాదు అద్భుతమైన బౌలింగ్‌తో శ్రీలంకను కేవలం 97 పరుగులకే కట్టడి చేసి 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇలా క్రీడా సమరంలో ఛాంపియన్‌గా నిలవడంపై జెమీమా రోడ్రిగ్స్ ఆనందం వ్యక్తం చేసింది.

‘‘పోడియంపై భారత జాతీయ జెండా సగర్వంగా ఎగరడం ఆనందంగా ఉంది. ఇలాంటి అనుభూతి అద్భుతం. బంగారు పతకం గెలవడం స్పెషల్‌. తొలిసారి భారత మహిళా క్రికెట్‌ జట్టు గోల్డ్‌ మెడల్‌ సాధించడం చరిత్రలో నిలిచిపోతుంది. ఆసియా క్రీడల్లో భారత జెర్సీని ధరించి బరిలోకి దిగడం భిన్నమైన అనుభవం. మేం కూడా ఒక మెడల్‌ను దేశం కోసం సాధించామని చెప్పడం బాగుంది. ఫైనల్‌లో శ్రీలంక మాకు గట్టి పోటీనిచ్చింది. అయితే, మా బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీస్తూ వారిపై ఒత్తిడి పెంచారు. బ్యాటింగ్‌లో మంధానతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నిర్మించడం ఆనందంగా ఉంది. ఇక్కడకు రాకముందు పిచ్‌ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడి గెలవాలనే లక్ష్యంతోనే ముందుకు సాగాం’’ అని జెమీమా వ్యాఖ్యానించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలోని పురుషుల జట్టు అక్టోబర్ 3న నేరుగా క్వార్టర్ ఫైనల్‌ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు