కోహ్లీని అలా చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్‌..!

టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్‌ చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్‌ అని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రాఆర్చర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 14 Mar 2021 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీని ఈ పర్యటనలో చాలాసార్లు త్వరగా ఔట్‌ చేయడం ఇంగ్లాండ్‌కు బోనస్‌ అని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రాఆర్చర్‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వగా, విరాట్‌ కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే. కాగా, అంతకుముందు జరిగిన నాలుగో టెస్టులోనూ అతడు పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌ చేరాడు. దీంతో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు. మరోవైపు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ విరాట్‌ ఇలాగే పెవిలియన్‌ చేరాడు. దీంతో కోహ్లీ ఇటీవలి కాలంలో పెద్ద స్కోర్లు సాధించకుండా త్వరగా ఔటైపోతున్నాడు.

ఈ క్రమంలోనే తొలి టీ20 అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్చర్‌ ‘మా ప్రణాళికలు కచ్చితంగా అమలవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది. రషీద్‌ ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఎక్కడైనా బౌలింగ్‌ చేయగల సమర్థుడు. కోహ్లీ ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ అనే విషయం తెలిసిందే. అయితే, అతడిని పదేపదే తక్కువ స్కోరుకు పరిమితం చేయడం ఇంగ్లాండ్‌ జట్టుకు నిజమైన బోనస్. ఇది కచ్చితంగా టీమ్‌ఇండియాను నిరుత్సాహపరిచి ఉండొచ్చు. అలాగే మా జట్టు విజయంలో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ప్రత్యర్థులు బలంగా ఉంటే నాలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది. నాకు ఒక వికెట్‌ దక్కినా.. మూడు వికెట్లు దక్కినా నా బౌలింగ్‌లో ఏమాత్రం మార్పు ఉండదు’ అని ఆర్చర్‌ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి 23/3 ప్రదర్శన చేశాడు. అందులో కీలకమైన కేఎల్‌ రాహుల్‌(1), హార్దిక్‌ పాండ్య(19), శార్ధూల్‌ ఠాకుర్‌(0) వికెట్లు తీశాడు. ఇక అదిల్‌ రషీద్‌ 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి విరాట్‌ కోహ్లీ వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 124/7 స్కోరుకు పరిమితమైంది. ఆపై ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని