Team India: టీ20 ప్రపంచకప్‌ 2007 ఫైనల్‌ ‘ఓవర్‌’ హీరో.. క్రికెట్‌కు వీడ్కోలు

తొలి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను (T20 world cup 2007) ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని భారత్‌ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. పాక్‌పై ఫైనల్‌లో (IND vs PAK) పోరాడి మరీ విజయం సాధించింది. ఈ విజయంలో జోగిందర్‌ శర్మ (Joginder Sharma) కీలక పాత్ర పోషించాడు. 

Updated : 03 Feb 2023 17:11 IST

ఇంటర్నెట్ డెస్క్: 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌.. తొలిసారి జరుగుతున్న పొట్టి వరల్డ్‌కప్‌ మరి అది. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా కప్‌ను సొంతం చేసుకొంది. తుది పోరులో పాకిస్థాన్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించిన మీడియం పేసర్ జోగిందర్‌ శర్మ (Joginder Sharma) అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడెందుకు అంటారా..? తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన ఈ హీరో అంతర్జాతీయతోపాటు దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 2004లో జాతీయ జట్టులోకి వచ్చిన జోగిందర్ టీమ్‌ఇండియా తరఫున కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20లను మాత్రమే ఆడాడు. పొట్టి కప్‌ ఫైనల్‌ మ్యాచే అతడి చివరి టీ20 కావడం గమనార్హం. 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మ్యాచుల్లో పాల్గొన్నాడు. ప్రపంచకప్‌లో రాణించినప్పటికీ.. జాతీయ జట్టు తరఫున పెద్దగా అవకాశాలు రాలేదు. 2007లోనే హరియాణా పోలీస్‌ శాఖలో జాయిన్‌ అయిన జోగిందర్‌.. 2020నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఎదిగాడు. 

ఈ క్రమంలో అన్ని విభాగాల క్రికెట్‌కు వీడ్కోలు చెబుతూ జోగిందర్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ‘‘కృతజ్ఞతాభావం, గర్వంతో ఇవాళ నేను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. 2002 నుంచి 2007 వరకు సాగిన క్రికెట్‌ ప్రయాణం నా జీవితంలో మరుపురాని అనుభవాలను మిగిల్చింది. భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ఇలా అవకాశం కల్పించిన బీసీసీఐ, హరియాణా క్రికెట్‌ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్‌, హరియాణా ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కోచింగ్‌ సేవలు, నాతో ఆడిన సహచరులు, మెంటార్స్, సహాయక సిబ్బందికి రుణపడి ఉంటా. కలను నిజం చేసుకోవడానికి పూర్తి సహాయ సహకారాలను అందించిన అభిమానులకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. క్రికెటర్‌గా, పోలీస్‌ ఆఫీసర్‌గా ఎదగడంలో కీలకంగా వ్యవహరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు’’ అని సందేశం పెట్టాడు. 

ఫైనల్‌లో అప్పుడు అలా..

టీ20 ప్రపంచకప్‌ 2007 ఫైనల్‌ మ్యాచ్‌లో.. తొలుత భారత్‌ బ్యాటింగ్‌లో 157/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 19 ఓవర్లకు 145/9 స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే స్టార్‌ బ్యాటర్ మిస్బా ఉల్ హక్‌ క్రీజ్‌లో ఉన్నాడు. అయితే కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ మాత్రం బంతిని జోగిందర్‌ చేతికి ఇచ్చాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తొలి బంతిని వైడ్‌గా వేసిన జోగిందర్.. రెండో బంతికి సిక్స్‌ ఇచ్చాడు. దీంతో పాక్‌ విజయ సమీకరణ నాలుగు బంతుల్లో ఆరు పరుగులుగా మారింది. భారత అభిమానుల్లో కంగారు మొదలైంది. మరో భారీ షాట్‌ కొడితే విజయం పాక్‌దే అవుతుందని ఆందోళన చెందారు. కానీ, జోగిందర్‌ వేసిన బంతిని స్కూప్ చేయబోయిన మిస్బా ఫైన్‌లెగ్‌  వైపు షాట్ కొట్టాడు. అక్కడే కాచుకొని ఉన్న శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్‌ను ఒడిసిపట్టడం.. పాక్‌ 152 పరుగులకే ఆలౌట్‌ కావడంతో తొలి టైటిల్‌ టీమ్‌ఇండియా ఖాతాలో పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని