Jonty Rhodes: టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌?

దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ (Jonty Rhodes)ను భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమిస్తారని వార్తలొస్తున్నాయి. 

Published : 18 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ (Jonty Rhodes)ను నియమిస్తారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. జట్టు సహాయక కోచింగ్‌ సిబ్బందిని తానే నిర్ణయిస్తానని, అందుకు సమ్మతిస్తేనే కోచ్‌గా వస్తానని గంభీర్‌ డిమాండ్‌ చేశారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అందుకు బోర్డు కూడా అంగీకరించిందని సమాచారం. 

ప్రస్తుతం బ్యాటింగ్‌కు విక్రమ్‌ రాథోడ్, బౌలింగ్‌కు పారస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌కు దిలీప్‌ సహాయ కోచ్‌లుగా ఉన్నారు. వీళ్ల స్థానాల్లో కొత్తవాళ్లను గంభీర్‌ తీసుకునే అవకాశముంది. ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పేరును గంభీర్‌ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు 2022, 2023 సీజన్‌లలో గంభీర్‌గా మెంటార్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. అప్పుడు లఖ్‌నవూకు జాంటీ రోడ్స్‌ ఫీల్డింగ్‌గా వ్యవహరించాడు. వీరి కాంబినేషన్‌లో జట్టు మంచి ఫలితాలు రాబట్టింది. దీంతో జాంటీ రోడ్స్‌ను టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా తీసుకువస్తే బాగుంటుందని గంభీర్‌ భావిస్తున్నాడట.  

జాంటీ రోడ్స్‌ మెరుపు ఫీల్డింగ్‌ విన్యాసాలతో ప్రపంచంలోనే మేటి ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఫీల్డింగ్‌ కోచ్‌గా మారాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు సుదీర్ఘ కాలంపాటు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 2022 సీజన్‌కు ముందు లఖ్‌నవూ కోచింగ్‌ స్టాఫ్‌లో చేరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని