SRH vs LSG: డగౌట్‌పై దాడి కాదు.. ఆటగాళ్లపైనే విసిరారు: జాంటీ రోడ్స్‌

ఈసారి ఐపీఎల్‌లో (IPL 2023) ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరగడం చూశాం. తాజాగా అభిమానుల అనుచిత ప్రవర్తనను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా చోటు చేసుకుంది.

Published : 15 May 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్: శనివారం రాత్రి ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్ - లఖ్‌నవూ (SRH vs LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేక్షకుల్లోని కొందరు తాము కూర్చున్న సీట్‌ నట్టులు, బోల్టులను తీసి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ డగౌట్‌పై విసరడంతో మ్యాచ్‌ను ఆరు నిమిషాలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. లఖ్‌నవూ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ను ఉద్దేశించి ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ పెద్దగా అరిచారు. డగౌట్‌పై బోల్టులు విసిరారని అంతా భావించారు. అయితే, లఖ్‌నవూ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌  మాత్రం ఓ కీలక విషయాన్ని బహిర్గతం చేశాడు. 

‘‘డగౌట్‌ మీద కాదు. ఆటగాళ్లపైనే ప్రేక్షకులు అనుచితంగా ప్రవర్తించారు. ప్రేరక్ మన్కడ్ ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో అతడి తలమీదకు విసిరారు. అప్పుడు అతడు లాంగ్‌ఆన్‌లో ఉన్నాడు’’ అని రోడ్స్‌ ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. అంతకుముందు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో లఖ్‌నవూ తలపడినప్పుడు కూడా విరాట్ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు గంభీర్‌ పట్ల మరోసారి నోరుపారేసుకున్నారు. కోహ్లీ నామస్మరణతో కాసేపు హోరెత్తించారు. గంభీర్‌ను లక్ష్యంగా చేసుకొనే ఇదంతా చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే..? 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు.. ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్‌లో అవేశ్‌ ఖాన్‌ వేసిన బంతిని ఫీల్డ్‌ అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. అయితే, లఖ్‌నవూ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. థర్డ్‌ అంపైర్‌ దానిని మంచి బంతినే పరిగణిస్తూ నిర్ణయం మార్చుకోవాలని ఫీల్డ్‌ అంపైర్‌ను సూచించాడు. ఈ క్రమంలోనే ప్రేరక్‌ మన్కడ్‌ తన తలకు ఏదో బలంగా తాకిందంటూ లఖ్‌నవూ డగౌట్‌కు సమాచారం ఇచ్చాడు.మైదానంలో వెతకగా నట్లు, బోల్ట్‌లు దొరికాయి. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకులు కొందరు సీట్లకు ఉన్న నట్లు, బోల్టులను మైదానంలోకి విసిరినట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని