Published : 25 May 2022 12:52 IST

T20 League : ఆ మైలురాయి అందుకొన్న ఆరో బ్యాటర్‌ జోస్ బట్లర్

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌ సీజన్‌లో తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ చేతిలో రాజస్థాన్‌ ఓటమిపాలైనా ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్‌ మాత్రం తన ఖాతాలో రెండు మైలురాళ్లను వేసుకొన్నాడు. ఇప్పటి వరకు లీగ్‌లో 718 రన్స్ చేసి అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఒకే సీజన్‌లో 700 కంటే ఎక్కువ రన్స్‌ చేసిన ఆరో బ్యాటర్‌ బట్లర్ కావడం విశేషం. ఇంతకుముందు విరాట్ కోహ్లీ 973 (2016), డేవిడ్ వార్నర్ 848 (2016), కేన్ విలియమ్సన్ 735 (2018), మైకేల్‌ హస్సీ 733 (2013), క్రిస్‌ గేల్ 733 (2012) మాత్రమే 700 పైచిలుకు పరుగులను సాధించారు. అలానే మొత్తం టీ20ల్లో 8000 పరుగుల మార్క్‌ను అందుకొన్న మూడో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్. ఇప్పటి వరకు టీ20ల్లో 8051 పరుగులను సాధించాడు. బట్లర్‌కు ముందు అలెక్స్ హేల్స్, లూక్‌ రైట్ ఉన్నారు. 

బట్లర్‌ తర్వాత కేఎల్ రాహుల్ (537), డికాక్ (502) మాత్రమే ఉన్నారు. లఖ్‌నవూ జట్టు ఫైనల్‌ వరకు చేరుకుంటే వీరిద్దరికి మూడు మ్యాచ్‌ల వరకు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ ఇన్నింగ్స్‌లను ఆడితే అందుకునే వీలుంది. మరోవైపు రాజస్థాన్‌ కూడా రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి. క్వాలిఫయర్‌-2లో గెలిస్తే ఫైనల్‌కు చేరుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత సీజన్‌లో బట్లర్ ఇదే జోరును కొనసాగిస్తే 800 పరుగుల మైలురాయిని కూడా దాటేయగలడు. 

మా బౌలర్లు కష్టపడ్డారు.. కానీ

గుజరాత్‌తో మ్యాచ్‌ అనంతరం రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాట్లాడాడు. ‘‘ఈడెన్‌ గార్డెన్స్ మైదానం ఛేజింగ్‌కు అనుకూలంగా మారింది. మొదట బ్యాటింగ్‌ చేసేటప్పుడు కన్నా రెండో సారి ఆడేటప్పుడు పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించింది. గుజరాత్ ఎదుట మంచి లక్ష్యమే ఉంచగలిగాం. పవర్‌ప్లేలో బంతి స్వింగ్‌ అవుతుందని భావించా. అయితే అలా జరగలేదు. గుజరాత్ బ్యాటర్లు కూడా బాగా ఆడారు. ఇక తొలుత బ్యాటింగ్‌తోనూ మా బ్యాటర్లు గుజరాత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగలిగారు. అయితే లక్ష్యాన్ని కాపాడుకోవడానికి మా బౌలర్లు ప్రయత్నించినా పిచ్‌ నుంచి పెద్దగా సహకారం దొరకలేదు’’ అని సంజూ శాంసన్‌ వివరించాడు. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని