Buttler: 30 బంతుల్లో 32.. 34 బంతుల్లో 92

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 220/3 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు...

Updated : 02 May 2021 22:40 IST

ఇంగ్లాండ్‌ తరఫున నాలుగో ఆటగాడు..

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 220/3 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి పది ఓవర్లకు 30 బంతుల్లో 32 పరుగులు చేసిన అతడు తర్వాత 34 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే అతడి విధ్వంసం ఎలా సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సన్‌రైజర్స్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ దాటించాడు.

ఈ క్రమంలోనే బట్లర్‌ 56 బంతుల్లో శతకం పూర్తిచేసుకున్నాడు. విజయ్‌ శంకర్‌ వేసిన 17వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన అతడు చివరి బంతికి సింగిల్‌ తీసి ఐపీఎల్‌లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున ఐపీఎల్‌లో మూడంకెల స్కోర్‌ అందుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అతడికన్నా ముందు కెవిన్‌ పీటర్సన్‌, బెన్‌స్టోక్స్‌, జానీ బెయిర్‌స్టో శతకాలు బాదారు. మరోవైపు ఐపీఎల్‌లో అంతకుముందు బట్లర్‌ అత్యధిక స్కోర్‌ 95 నాటౌట్‌. 2018లో జైపూర్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో ఈ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ దంచికొట్టాడు. ఆ తర్వాత ఇదే అతడి అత్యధిక స్కోర్‌.

ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(12)తో బ్యాటింగ్‌ ఆరంభించిన బట్లర్‌.. తర్వాత కెప్టెన్‌ సంజూ ‌(48; 33 బంతుల్లో 4x4, 2x6)తో కలిసి రెండో వికెట్‌కు 150 పరుగులు జోడించాడు. వీరిద్దరూ సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే విజయ్‌ శంకర్‌ వేసిన 17వ ఓవర్‌లో సంజూ ఔటైనా బట్లర్‌ శతకం సాధించాడు. చివరికి సందీప్‌ శర్మ వేసిన 19వ ఓవర్‌ చివరి బంతికి బౌల్డయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని