Sanju Samson కెప్టెన్‌గా ఎదుగుతున్నాడు! 

కెప్టెన్సీ అనేది సంజూ శాంసన్ నేర్చుకునే గొప్ప అనుభవమని, అందులో అతడు మెరుగవుతున్నాడని ఆ జట్టు ఓపెనర్ జోస్‌ బట్లర్‌ అన్నాడు. తాజాగా రాజస్థాన్‌ టీమ్‌ నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో బట్లర్...

Published : 13 May 2021 22:10 IST

రాజస్థాన్ రాయల్స్‌ ఓపెనర్ జోస్‌ బట్లర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కెప్టెన్సీ అనేది సంజూ శాంసన్ నేర్చుకునే గొప్ప అనుభవమని, అందులో అతడు మెరుగవుతున్నాడని ఆ జట్టు ఓపెనర్ జోస్‌ బట్లర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా రాజస్థాన్‌ టీమ్‌ నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో బట్లర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘కెప్టెన్సీ అనేది సంజూ నేర్చుకోవడానికి గొప్ప అనుభవంలా పనికొస్తుంది. టోర్నీ జరిగేకొద్దీ అతడా బాధ్యతల్లో మెరుగవుతున్నాడు. ఒక జట్టుగా టోర్నీ పూర్తయ్యేసరికి నిలకడైన ప్రదర్శనతో సమష్టిగా రాణించాలనుకున్నాడు. నేను అతడి సారథ్యంలో బాగా ఆస్వాదించాను’ అని బట్లర్‌ పేర్కొన్నాడు.

ఒక వ్యక్తిగా కెప్టెన్సీ సంజూని మార్చలేదని, అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడని రాజస్థాన్‌ ఓపెనర్‌ వివరించాడు. అలాగే తమ జట్టును కూడా తీర్చిదిద్దాలనుకున్నట్లు చెప్పాడు. తమ నుంచి సంజూ అదే ఆశించాడన్నాడు. ఒక కెప్టెన్‌గా అలా కచ్చితమైన అభిప్రాయంతో ఉండటం చాలా ముఖ్యమని, ఆ విషయంలో సంజూ అలాగే ఉన్నాడని తెలిపాడు. అనంతరం రాజస్థాన్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. అతడో ప్రత్యేకమైన ఆటగాడని, రాజస్థాన్‌ జట్టులోనే కాకుండా భవిష్యత్‌లో టీమ్‌ఇండియాకు సైతం అత్యుత్తమ సేవలు అందిస్తాడన్నాడు. అందుకోసం పరాగ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అతడికి మెరుగైన శిక్షణ అందించాలన్నాడు.

కాగా, గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు కెప్టెన్సీ చేసిన స్టీవ్‌స్మిత్‌ సరైన ఫలితాలు సాధించకపోవడంతో ఈసారి ఆ జట్టు అతడిని వదిలేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సీజన్‌కు ముందు రాజస్థాన్‌ సంజూను కొత్త సారథిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 9న ప్రారంభమైన 14వ సీజన్‌లో అతడు తొలిసారి కెప్టెన్సీ చేపట్టాడు. ఇక సగం సీజన్‌ పూర్తయ్యేసరికి బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. అప్పటికే రాజస్థాన్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు టోర్నీ తిరిగి ప్రారంభమైనప్పుడు సంజూ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని