Jasprit Bumrah: బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టం..అతడు అత్యంత కఠినమైన బౌలర్‌: క్రిస్‌గేల్‌

పొట్టి ఫార్మాట్లలో భారత పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కోవడం తనకు కష్టంగా ఉండేదని, అతడు అత్యంత కఠిన బౌలర్‌ అని యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ పేర్కొన్నాడు.

Published : 02 Feb 2023 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్: క్రికెట్‌లో తాను ఎదుర్కొన్న వారిలో భారత ఆటగాడు జస్ప్రీత్‌ బుమ్రా అత్యంత కఠినమైన బౌలరని వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌గేల్‌ తెలిపాడు. ఐపీఎల్‌, టీ20 వంటి పొట్టి ఫార్మాట్లలో బుమ్రా బౌలింగ్‌లో పరుగులు సాధించడం కష్టంగా ఉండేదన్నాడు. ఓ ఛానల్‌కు సంబంధించిన షోలో గేల్‌ ఈ విధంగా మాట్లాడాడు.

‘‘ఐపీఎల్‌లో నేను ఎదుర్కొన్న వారిలో అత్యంత కఠినమైన బౌలర్‌ బుమ్రా. ఇక టీ20ల్లో అతడి బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం చాలా కష్టంగా ఉండేది. స్కోర్‌ చేయనివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేవాడు. అతడు వేసే స్లో బాల్‌కి ఆడటం నాకు మరింత క్లిష్టంగా ఉండేది. అతడు చాలా ప్రత్యేకమైన బౌలర్‌. అతడిని ఎవరూ అందుకోలేరు’’ అని గేల్ పేర్కొన్నాడు. భారత జట్టులో జస్ప్రీత్‌ బుమ్రా కీలకమైన బౌలర్‌. కొంతకాలంగా వెన్నుగాయంతో బాధపడుతున్న బుమ్రా.. గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడలేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా ఆడతాడని తొలుత బీసీసీఐ ప్రకటించింది. కానీ అతడికి ఇంకా విశ్రాంతి అవసరమని ఎన్‌సీఏ వైద్య బృందం సూచించడంతో తిరిగి జట్టు నుంచి తొలగించింది. ఫిబ్రవరి 9న భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభమవనుంది. తొలి రెండు టెస్టులకు అతడు ఎంపికకాలేదు. తర్వాతి రెండు టెస్టులకైనా బుమ్రా అందుబాటులోకి రావాలని క్రికెట్‌ అభిమానులు ఆశిస్తున్నారు. కాగా గేల్‌  వ్యాఖ్యలను న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టైరిస్‌ సమర్థించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని