ఆస్ట్రేలియా అవకాశాలకు గండి పడింది అక్కడే! 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలో ఆస్ట్రేలియా లేకపోవడం నిరాశకు గురిచేసిందని, అందుకు టీమ్‌ఇండియాతో ఆడిన మెల్‌బోర్న్‌ టెస్టులో తమ స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగే కారణమని...

Updated : 09 Mar 2021 14:05 IST

మెల్‌బోర్న్‌ టెస్టులో స్లో ఓవర్‌రేటే కారణం: లాంగర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలో ఆస్ట్రేలియా లేకపోవడం నిరాశకు గురిచేసిందని, అందుకు టీమ్‌ఇండియాతో ఆడిన మెల్‌బోర్న్‌ టెస్టులో తమ స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగే కారణమని ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. గతేడాది డిసెంబర్‌ 26న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్టులో తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అజింక్య రహానె సెంచరీ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు. కాగా, ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా బౌలింగ్‌ చేసింది. దాంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు కోతకు గురైంది.

మరోవైపు టీమ్‌ఇండియా అక్కడ 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ కైవసం చేసుకోవడం, తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్‌ను 3-1 తేడాతో ఓడించడంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అగ్రస్థానం సంపాదించింది. దాంతో జూన్‌ 18న సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తుదిపోరుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలోనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుదిపోరులో ఆస్ట్రేలియా లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని లాంగర్‌ అన్నాడు.  మెల్‌బోర్న్‌ టెస్టు పూర్తయ్యాకే తాము స్లో బౌలింగ్‌ చేశామనే విషయం గుర్తొచ్చిందని చెప్పాడు. అది తమ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అవకాశాలకు గండి కొడుతుందని అప్పుడే భావించానని తెలిపాడు.

‘ఆ మ్యాచ్‌ ముగిశాక మా ఆటగాళ్లతో మాట్లాడాను. వారికి జరిగిన విషయం వివరించాను. రెండు ఓవర్లు స్లో బౌలింగ్‌ చేశామని, అది టెస్టు ఛాంపియన్‌షిప్‌ అవకాశాలను దూరం చేసే పరిస్థితి కల్పించొచ్చని అన్నాను. తర్వాత ఆడే సిడ్నీ, గబ్బా టెస్టుల్లో అలాంటి తప్పు జరగకూడదని చెప్పాను. అది బాగా నిరాశ కలిగించింది. ఒక గుణపాఠంలా అనిపించింది. ఇకపై జాగ్రత్తగా ఉండాలనే విషయం నేర్పింది’ అని లాంగర్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, అక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల కారణంగా కంగారూల జట్టు సిరీస్‌ను రద్దు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని