షాక్‌: కేఎల్ రాహుల్ సిరీస్‌కు దూరం

టీమిండియాకు మరో షాక్‌! సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్‌కీపర్‌-బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మణికట్టు బెణకడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు...

Updated : 05 Jan 2021 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియాకు మరో షాక్‌! సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మణికట్టు బెణకడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్ శర్మ జట్టుకు దూరమైన ప్రతికూలతల్లో.. కేఎల్ రాహుల్‌ కూడా దూరమవ్వడం టీమిండియాను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్‌లో రాహుల్‌కు శనివారమే గాయమైందని, కోలుకోవడానికి మరో మూడు వారాలు పడుతుందని బీసీసీఐ తెలిపింది. అతడు స్వదేశానికి బయలుదేరి, ఎన్‌సీఏలో చేరనున్నాడని వెల్లడించింది.

‘‘మెల్‌బోర్న్‌ మైదానంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేఎల్‌ రాహుల్ ఎడమచేతి మణికట్టు బెణికింది. గాయం కారణంగా వికెట్‌కీపర్‌-బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ఆస్ట్రేలియా పర్యటనలోని చివరి రెండు టెస్టులకు దూరమవుతున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి అతడికి మూడు వారాలు పడుతుంది. అతడిప్పుడు భారత్‌కు తిరిగివెళ్లనున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చేరుతాడు’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో రాహుల్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి చోటు దక్కలేదు. ఎంతో ప్రతిభ ఉన్న రాహుల్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా విఫలమవ్వడంతో మూడో టెస్టులో కేఎల్‌ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. కానీ అతడు గాయపడటం టీమిండియాకు ప్రతికూలాంశమే. ఇప్పటికే షమి, ఉమేశ్ యాదవ్ టెస్టు సిరీస్‌లో గాయపడి స్వదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా భారత్×ఆసీస్‌ మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

గబ్బాపై అభ్యంతరమా.. అదేం లేదే!

గంగూలీకి మళ్లీ యాంజియోప్లాస్టీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని