Published : 17 May 2022 01:47 IST

World Cup 2003: భారత్‌తో మ్యాచ్‌లో రజాక్‌పై అక్రమ్‌ తీవ్ర ఆగ్రహం.. ఎందుకో చెప్పిన కైఫ్‌

నాటి సంఘటనను గుర్తు చేసుకున్న టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్-పాకిస్థాన్‌ జట్ల మధ్య సమరం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ప్రపంచకప్‌ చరిత్రలో (వన్డే, టీ20) ఒకే ఒక్కసారి మాత్రమే భారత్‌పై పాక్‌ గెలిచింది. మిగతా అన్నిసార్లూ టీమ్‌ఇండియాదే ఆధిపత్యం. 2003 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ ఫైట్‌ను ఎవరూ మరిచిపోలేరు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అద్భుతమైన ఫామ్‌తో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే తుదిపోరులో ఆసీస్‌పై ఓటమిపాలైనప్పటికీ భారత క్రికెట్‌ చరిత్రలో అదొక సువర్ణధ్యాయమే. ఈ క్రమంలో పాక్‌తో జరిగిన పోరును మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ గుర్తు చేసుకున్నాడు. ఓ క్రీడా ఛానల్‌తో షోయబ్‌ అక్తర్‌తో కలిసి కైఫ్‌ మాట్లాడాడు.

అబ్దుల్ రజాక్‌పై వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనను మహమ్మద్‌ కైఫ్‌ వివరించాడు. ధాటిగా ఆడుతున్న సచిన్‌ క్యాచ్‌ను అబ్దుల్ రజాక్‌ వదిలేశాడు. దీంతో వసీం అక్రమ్‌ ఒక్కసారిగా రజాక్‌పై కోప్పడ్డాడు. అసలు అప్పుడేమైందనేదానిని కైఫ్‌ వివరించాడు. ‘‘భారత్-పాక్ మ్యాచ్‌ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. అప్పుడు జరిగిన మ్యాచ్‌ చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఒకవేళ సచిన్‌ క్యాచ్‌ను మిడ్‌-ఆఫ్‌లో రజాక్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ ఇంకా రసవత్తరంగా మారేది. నాకు ఇప్పటికీ గుర్తు.. ఆ రోజు రజాక్‌పై వసీం అక్రమ్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అయితే రజాక్‌ మిడ్‌-ఆఫ్‌లో కాకుండా బౌలర్‌కు కాస్త పక్కగా నిలబడటంతో క్యాచ్‌ను అందుకోలేకపోయాడు’’ అని కైఫ్ తెలిపాడు. సచిన్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేశాడని, అతడికి కేవలం మద్దతుగా నిలవడానికి మాత్రమే క్రీజ్‌లో ఉన్నట్లు కైఫ్‌ పేర్కొన్నాడు. ‘‘నీతో భాగస్వామ్యం నిర్మించేందుకే ఉన్నానని సచిన్‌తో చెప్పా. ఎటాకింగ్‌ మొదలుపెడితే నేను స్ట్రైక్‌ను రొటేట్‌ మాత్రమే చేశా. ఆ పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నా’’ అని వివరించాడు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 273/7 స్కోరు సాధించింది. సయీద్ అన్వర్  (101) శతకం సాధించాడు. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే దక్కింది. సచిన్‌-వీరేంద్ర సెహ్వాగ్ (21) జోడీ అర్ధశతక (53) భాగస్వామ్యం జోడించారు. అయితే సెహ్వాగ్‌తోపాటు గంగూలీ (0) వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన  మహమ్మద్ కైఫ్‌ (35)తో కలిసి సచిన్‌ 102 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. అయితే సచిన్‌ 98 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆఖర్లో రాహుల్ ద్రవిడ్ (44*), యువరాజ్‌ సింగ్ (50*) పాకిస్థాన్‌ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 45.4 ఓవర్లలోనే ముగించేశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని