Tokyo olympics : మహిళల డిస్కస్‌త్రో.. ఫైనల్‌కు కమల్‌ప్రీత్‌ కౌర్‌ అర్హత

మహిళల డిస్కస్‌త్రో ఫైనల్‌కు కమల్‌ప్రీత్‌ కౌర్‌ అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌

Updated : 31 Jul 2021 17:34 IST

టోక్యో: ఒలింపిక్స్‌ మహిళల డిస్కస్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. తుదిపోరుకు నిర్వహించిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో శనివారం ఉదయం కమల్‌ప్రీత్‌ కౌర్‌ రెండో స్థానంలో నిలిచి అత్యద్భుత ప్రదర్శన చేసింది. దాంతో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న సీమా పూనియా 16వ స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. ఇక అమెరికా క్రీడాకారిణి వలరీ అల్మన్‌ 66.42 మీటర్లతో అందరికన్నా ముందు అగ్రస్థానంలో నిలిచింది. కమల్‌ప్రీత్‌ 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించింది.

కాగా, ఫైనల్‌ పోటీ ఆగస్టు 2న జరగనుంది. అక్కడ మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్‌ ఫైనల్లోనూ ఇలాంటి మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్‌కు మరో పతకం ఖాయమనే చెప్పొచ్చు. ఇక క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో కమల్‌ప్రీత్‌ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు విసరగా రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు డిస్కస్‌ త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మీటర్లు సాధించి అటోమేటిగ్గా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక్కడ ఎవరైతే 64 మీటర్లు సాధిస్తారో వారు నేరుగా తుదిపోరుకు దూసుకెళ్తారు. అలాకాకపోతే అందరిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్‌ 12 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఇక 16వ స్థానంలో నిలిచి ఇంటిముఖం పట్టిన పూనియా 60.57 మీటర్లే డిస్కస్‌ త్రో చేయగలిగింది.

మరోవైపు కమల్‌ప్రీత్‌ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. ఇప్పటికే ఆమె రెండుసార్లు 65 మీటర్లను చేరుకొని జాతీయ అత్యుత్తమ రికార్డు నెలకొల్పింది. మార్చిలో నిర్వహించిన ఫెడరేషన్‌ కప్‌లో ఆమె 65.06 మీటర్ల దూరం విసిరి భారత్‌ తరఫున మెరుగైన ప్రదర్శన చేసింది. అలాగే జూన్‌లో జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి-4 ఈవెంట్‌లో తన రికార్డును తనే బద్దలుకొట్టింది. ఈసారి ఆమె త్రో ఏకంగా 66.59 మీటర్ల దూరం విసరడం విశేషం. ఇక ఈ సీజన్‌లో 70.22 మీటర్ల అత్యుత్తమ  ప్రదర్శన చేసిన నెదర్‌లాండ్స్‌ క్రీడాకారిణి జోరిండ్‌ వాన్‌ క్లింకెన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో విఫలమైంది. ఆమె 61.15 మీటర్లతోనే సరిపెట్టుకొని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. అలాగే ఈ సీజన్‌లో 70.01 మీటర్ల రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అమెరికా క్రీడాకారిణి అల్మన్‌ తొలి స్థానంలో నిలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని