Team India: ఒకేసారి మూడు జట్లతో ఆడగలదు 

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ కమ్రన్‌ అక్మల్‌ భారత క్రికెట్‌ ఆలోచనా ద్రుక్పథాన్ని ప్రశంసించాడు. టెస్టు క్రికెట్‌కు టీమ్‌ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పాడు. ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదన్నాడు...

Published : 31 May 2021 01:08 IST

ధోనీ తప్ప మిగతా దిగ్గజాలంతా అలానే చేశారు : అక్మల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ కమ్రన్‌ అక్మల్‌ భారత క్రికెట్‌ ఆలోచనా దృక్పథాన్ని ప్రశంసించాడు. టెస్టు క్రికెట్‌కు టీమ్‌ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పాడు. ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘టెస్టు క్రికెట్‌ విషయంలో భారత్‌ ఎప్పుడూ రాజీపడలేదు. పాఠశాల స్థాయిలోనే అక్కడ రెండు, మూడు రోజుల ఆటలు నిర్వహిస్తారు. దాంతో వారికి బలమైన పునాది పడుతుంది. అలాగే టీమ్‌ఇండియా సంప్రదాయ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంవల్లే ఇప్పుడు 50 మంది ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్నారు. దాంతో వాళ్లు ఒకేసారి మూడు జట్లతో తలపడే సామర్థ్యం ఉంది. భారత క్రికెట్‌లో ధోనీ మినహా మిగతా దిగ్గజాలందరూ తమ చివరి మ్యాచ్‌ను టెస్టుల్లోనే ముగించారు. దీన్ని బట్టే వాళ్లు ఆ ఆటకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో అర్థం చేసుకోవచ్చు’ అక్మల్‌ చెప్పుకొచ్చాడు.

అలాగే భారత క్రికెట్‌లో లిస్ట్‌-ఏ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడకముందే 40-50 మ్యాచ్‌లు ఆడి ఉంటారని, దాంతో వారికి తగినంత అనుభవం ఉంటుందని పాక్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ వివరించాడు. వారు టీమ్‌ఇండియాకు ఎంపికయ్యేసరికే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటారన్నాడు. అందుకు సూర్యకుమార్‌ యాదవే సరైన ఉదాహరణగా పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ జట్టు ఆలోచనా విధానం మెచ్చుకోదగినదని, దిగ్గజ ఆటగాళ్లు.. రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అనిల్‌కుంబ్లే లాంటి వారు ఏదో ఒక రూపంలో సేవలందిస్తున్నారని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా ఇప్పుడు 50 మంది ఆటగాళ్లతో సిద్ధంగా ఉందన్నాడు. త్వరలో జరిగే శ్రీలంక పర్యటనలోనూ భారత యువ ఆటగాళ్లే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, టీమ్‌ఇండియా ప్రధాన ఆటగాళ్లు జులైలో ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉండనుండగా.. ధావన్‌, హార్దిక్‌ పాండ్య, శ్రేయస్ అయ్యర్‌, పృథ్వీషా లాంటి ద్వితీయశ్రేణి ఆటగాళ్లు లంక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే అక్మల్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని