IND vs PAK: గంభీర్‌తో గొడవలు లేవు.. ఆరోజు తప్పుగా అర్థం చేసుకున్నా: అక్మల్

టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని పాకిస్థాన్‌ మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కమ్రన్‌ అక్మల్‌ తెలిపాడు...

Updated : 31 Jan 2022 12:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని పాకిస్థాన్‌ మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కమ్రన్‌ అక్మల్‌ తెలిపాడు. అతడు చాలా మంచి వ్యక్తని కితాబిచ్చాడు. 2010 ఆసియాకప్‌లో భాగంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్న ఘటనపై తాజాగా అక్మల్‌ స్పష్టత ఇచ్చాడు. అప్పుడు తాను గంభీర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నట్లు చెప్పాడు. అసలేం జరిగిందంటే.. నాటి మ్యాచ్‌లో గంభీర్‌ ఆడబోయిన ఓ బంతిని వికెట్ల వెనుకున్న పాక్‌ కీపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దాన్ని అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌటిచ్చాడు. ఇదే విషయంపై డ్రింక్స్‌ బ్రేక్‌ సమయంలో గంభీర్‌.. అతడి వద్దకెళ్లి ఆ బంతి తన బ్యాట్‌కు తాకలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

ఆ సమయంలో గంభీర్‌తో సహా బ్యాటింగ్‌ చేస్తున్న ధోనీ కలగజేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ ఉదంతం గురించి తాజాగా అక్మల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతోన్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ సందర్భంగా ఓ ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో భాగంగా వ్యాఖ్యాత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

* టీమ్‌ఇండియా క్రికెటర్లలో హర్భజన్‌ లేదా గౌతమ్‌ గంభీర్‌.. ఇద్దరిలో ఎవరితో మీకు ఎక్కువ గొడవలున్నాయి..? 

అక్మల్‌: నాకైతే ఇద్దరితో ఎలాంటి గొడవలు లేవు. అయితే, గంభీర్‌తో ఆసియా కప్‌ మ్యాచ్‌లో చిన్న పొరపాటు జరిగింది. నేను అతడు ఔటయ్యాడని తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ, గంభీర్‌ చాలా మంచి క్రికెటర్‌. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అలాగే ఒకసారి బెంగళూరులో ఇషాంత్‌తో జరిగిన వివాదంలోనూ నాకెలాంటి శత్రుత్వం లేదు.

* టీమ్‌ఇండియాలో ఇర్ఫాన్‌ ఖాన్‌ లేదా జహీర్‌ ఖాన్‌.. ఎవరెక్కువ డేంజర్‌?

అక్మల్‌: జహీర్‌ ఖానే. అతడే బెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్‌.

* ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ ఎవరు?

అక్మల్‌: నేను చాలా దగ్గరగా చూసినవారిలో రషీద్‌ లతీఫ్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌. గత 15 ఏళ్లలో మహేంద్రసింగ్‌ ధోనీ బెస్ట్‌.

* కమ్రాన్‌ అక్మల్‌, ఉమ్రాన్‌ అక్మల్‌.. ఇద్దరిలో ఎవరు బెస్ట్‌?

అక్మల్‌: నేనైతే ఉమర్‌ పేరే చెప్తా.

* కమ్రాన్‌ మైదానంలో ఎందుకు సీరియస్‌గా ఉంటాడు?

అక్మల్‌: నిజమా.. నేనైతే అలా ఉండను. ఒక్కోసారీ కీపింగ్‌లో మ్యాచ్‌ పరిస్థితుల్ని బట్టి అలా ఉండొచ్చు. కానీ, నేను ఎక్కవమటుకు చాలా సరదాగా ఉంటా. ఆటను ఆస్వాదిస్తుంటా.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts