Kane Williamson: సచిన్, సెహ్వాగ్‌ రికార్డును సమం చేసిన కేన్ విలియమ్సన్

కివీస్‌ మాజీ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ అదరగొట్టేస్తున్నాడు. మొన్నటి వరకు కోహ్లీలా (Virat Kohli) ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడిన కేన్‌.. ఇప్పుడు లంకపై వరుసగా భారీ ఇన్నింగ్స్‌లను ఆడేస్తున్నాడు.

Updated : 18 Mar 2023 10:46 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ (Kane Williamson) ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీతో కివిస్‌ను గెలిపించిన కేన్.. రెండో టెస్టులోనూ విజృంభించాడు. టెస్టు కెరీర్‌లో ఆరో డబుల్‌ సెంచరీని నమోదు చేయడం విశేషం. లంకపై 296 బంతుల్లో 215 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్‌ (5), జో రూట్‌ (5)ను అధిగమించిన కేన్‌.. సచిన్‌ తెందూల్కర్ (Sachin), వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్‌ వంటి దిగ్గజ క్రికెటర్ల రికార్డును సమం చేశాడు. వీరు టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీల మైలురాయిని దాటారు.  సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధికంగా సర్ డాన్‌ బ్రాడ్‌మన్‌ కేవలం 52 టెస్టుల్లోనే 12 ద్విశతకాలను సాధించాడు. 

ప్రస్తుతం 94వ టెస్టు ఆడుతున్న కేన్ విలియమ్సన్ 8,124 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు డబుల్‌ సెంచరీలు, 28 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 580/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. కేన్‌ విలియమ్సన్‌తోపాటు హెన్రీ నికోల్స్ (200*) ద్విశతకం బాదాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 363 పరుగులను జోడించారు. అంతకుముందు డేవన్ కాన్వే (78) కూడా అర్ధశతకం సాధించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని