Williamson: అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యేవాడినే..! 

గతవారం టీమ్‌ఇండియాతో తలపడిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తాను తృటిలో ఔటయ్యేవాడినని, కానీ రివ్యూకు వెళ్లడంతో బతికిపోయానని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు...

Published : 29 Jun 2021 01:37 IST

డీఆర్‌ఎస్‌ కోరడంతో బతికిపోయా: కేన్‌ విలియమ్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గతవారం టీమ్‌ఇండియాతో తలపడిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తాను తృటిలో ఔటయ్యేవాడినని, కానీ రివ్యూకు వెళ్లడంతో బతికిపోయానని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. తాజాగా అతడు ఓ జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మ్యాచ్‌ జరిగేటప్పుడు ఆరోరోజు (రిజర్వ్‌డే) టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం కివీస్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విలియమ్సన్ ‌(52*), రాస్‌టేలర్‌ (47*) మూడో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించి చివరివరకూ క్రీజులో ఉన్నారు. దాంతో ఆ జట్టుకు తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ అందించారు.

అయితే, ఆరోజు విలియమ్సన్‌ తక్కువ స్కోరు వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా ఒకానొక సందర్భంలో అశ్విన్‌ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయినట్లు అనిపించింది. భారత జట్టు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. తాను ఔటవ్వలేదని భావించిన కివీస్‌ కెప్టెన్‌ రివ్యూకు వెళ్లాడు. అక్కడ బంతి వికెట్లకు నేరుగా పిచ్‌ అయినా చివరికి వాటిని తాకకుండా కాస్త పక్కనుంచి వెళ్లినట్లు తేలింది. దాంతో అతడు బతికిపోయాడు. ఇదే విషయాన్ని విలియమ్సన్‌ తాజాగా వివరించాడు. ‘ఆ బంతి వికెట్లకు చాలా దగ్గరగా వెళ్లింది. కానీ, అశ్విన్‌ బౌలింగ్‌ చేసే విధానం చూసి నేను ఔటవ్వనని అనుకున్నా. అందువల్లే రివ్యూకు వెళ్లా. అదృష్టంకొద్దీ ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది’ అని విలియమ్సన్‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు మ్యాచ్‌ గెలిచాక టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని హత్తుకోవడంపై స్పందిస్తూ.. తామిద్దరం సహచర ఆటగాళ్లమని, ఎప్పటి నుంచో కలిసి ఆడుతున్నామని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని