Kane Williamson: గ్రూప్‌ దశలోనే కివీస్‌ ఇంటికి.. కేన్‌ విలియమ్సన్‌ సంచలన నిర్ణయం

టీ20 ప్రపంచకప్‌ 2024లో న్యూజిలాండ్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Updated : 19 Jun 2024 10:30 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2024లో న్యూజిలాండ్ గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. జట్టు ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అంతేకాదు 2024-25 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ఈవిషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో పేర్కొంది.  జాతీయ కాంట్రాక్ట్‌ను తిరస్కరించినప్పటికీ ఆటగాడిగా జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలిపింది. 

ఈ నిర్ణయంతో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్నానని భావించకూడదని విలియమ్సన్ చెప్పాడు. భవిష్యత్తులో సెంట్రల్ కాంట్రాక్ట్‌ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.  ‘‘అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో జట్టును ముందుకుతీసుకెళ్లడంలో సహాయపడటానికి ఇష్టపడతాను. దానికోసం నేను సహకారం అందించాలనుకుంటున్నాను. అయితే న్యూజిలాండ్ వేసవి సమయంలో జట్టు చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో విదేశాల్లో ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడటం కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆఫర్‌ను తిరస్కరించాను’’ అని కివీస్‌ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ప్రకటనలో విలియమ్సన్‌ పేర్కొన్నాడు.

ఈ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ సిలో ఉన్న కివీస్.. తొలి రెండు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌, వెస్టిండీస్‌ చేతిలో ఓడింది. తర్వాత చిన్న జట్లయిన ఉగాండా, పాపువా న్యూగినిలపై నెగ్గింది. అయినప్పటికీ న్యూజిలాండ్ సూపర్‌-8కు అర్హత సాధించలేకపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని