Kane Williamson: తొలి మ్యాచ్‌తో పోలిస్తే బాగా మెరుగయ్యాం: విలియమ్సన్

టీ20 మెగా లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌ రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలై అభిమానులను మరోసారి నిరాశకు గురిచేసింది...

Published : 05 Apr 2022 10:26 IST

(Photo: Kane Williamson Instagram)

ముంబయి: టీ20 మెగా లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌ రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలై అభిమానులను మరోసారి నిరాశకు గురిచేసింది. సోమవారం రాత్రి లఖ్‌నవూతో తలపడిన పోరులో 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అయితే, తొలి మ్యాచ్‌తో పోలిస్తే రెండో మ్యాచ్‌లో తమ ప్రదర్శన చాలా మెరుగైందని హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు.

‘తొలి మ్యాచ్‌తో పోలిస్తే రెండో గేమ్‌లో మేం చాలా మెరుగయ్యాం. ఇక మ్యాచ్‌ ఆరంభంలోనే బంతితో పలు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాం. దాంతో మేం మెరుగైన స్థితిలోనే నిలిచాం. కానీ, కేఎల్‌ రాహుల్‌ (68; 50 బంతుల్లో 6x4, 1x6), దీపక్‌ హుడా (51; 33 బంతుల్లో 3x4, 3x6)ల భాగస్వామ్యం విడదీయాల్సింది. వాళ్లిద్దరూ బాగా ఆడారు. ఛేదనలో మేం గెలుపుటంచుల దాకా వెళ్లాం.. కానీ, గెలవలేకపోయాం. ఈ పిచ్‌ బ్యాటింగ్‌ చేసేందుకు బాగున్నా 170 పరుగుల లక్ష్యం ఛేదించడం ఎప్పుడైనా కష్టమే. మేమింకా బాగా ఆడాల్సింది. ఓపెనర్లు శుభారంభం చేసి.. తర్వాత మంచి భాగస్వామ్యాలు నిర్మిస్తే ఈ లక్ష్యాన్ని పూర్తి చేయొచ్చని అనుకున్నాం. అయితే, ఈరోజు మేం పనిపూర్తి చేయలేకపోయాం’ అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆదిలోనే డికాక్‌ (1), ఎవిన్‌ లూయిస్‌ (1), మనీశ్‌ పాండే (11)ల వికెట్లు కోల్పోయినా.. రాహుల్‌, దీపక్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 87 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించి లఖ్‌నవూ మెరుగైన స్కోర్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఛేదన ఆరంభించిన హైదరాబాద్‌ కాస్త పోరాడినా చివరికి 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాహుల్‌ త్రిపాఠి (44; 30 బంతుల్లో 5x4, 1x6), నికోలస్‌ పూరన్‌ (34; 24 బంతుల్లో 3x4, 2x6) మధ్యలో మెరుపులు మెరిపించారు. అయితే, చివర్లో సరైన బ్యాట్స్‌మెన్‌ లేక హైదరాబాద్‌ ఓటమిపాలైంది. అంతకుముందు రాజస్థాన్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లో విలియమ్సన్‌ టీమ్‌ 149/7కే పరిమితమైంది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓటమిపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని