Kane williamson: భారత్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ దూరం.. కారణం ఇదే!

భారత్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కానున్నాడు.

Published : 21 Nov 2022 10:31 IST


దిల్లీ: భారత్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు(ఎన్‌జెడ్‌సీ) సోమవారం ప్రకటించింది. మంగళవారం నేపియర్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు ఆ జట్టు పేసర్‌ టిమ్‌ సౌథీ సారథిగా వ్యవహరించనున్నాడు. మరో ఆటగాడు మార్క్‌ చాప్‌మన్‌ కివీస్‌ జట్టులో తిరిగి చేరనున్నాడు. అయితే, శుక్రవారం టీమ్‌ఇండియాతో ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్‌కు కేన్‌ తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపడతాడని బోర్డు స్పష్టతనిచ్చింది. 

‘‘వైద్యుడితో ముందుగా తీసుకున్న అపాయింట్‌మెంట్‌ వల్ల కేన్‌ మూడో టీ20లో ఆడలేకపోతున్నాడు. మెడికల్‌ అపాయింట్‌మెంట్‌ కోసం అతడు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాడు. బిజీ షెడ్యూల్‌ వల్ల అందుకు సరైన సమయం దొరకలేదు. ఆక్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే సిరీస్‌లో కేన్‌ తిరిగి పాల్గొంటాడు. అతడి రాక కోసం మేం ఎదురుచూస్తుంటాం. ఆటగాళ్ల ఆరోగ్యం, శ్రేయస్సే మాకు అన్నింటికన్నా ముఖ్యం. అయితే కెప్టెన్‌ను ఎప్పటినుంచో ఇబ్బందిపెడుతున్న మోచేయి గాయానికి, ఇప్పుడు వైద్యుడిని సంప్రదించడానికి ఎలాంటి సంబంధం లేదు. ఆక్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మార్క్‌ చాప్‌మన్‌ మంగళవారం నేపియర్‌లో ఆడనున్న జట్టులో  చేరతాడు’’ అంటూ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ వెల్లడించాడు.

కివీస్‌తో మూడు టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. రెండో టీ20లో ఆ జట్టుపై 65 పరగుల తేడాతో భారత్‌ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సిరీస్‌లో 1-0తో టీమ్‌ఇండియా పైచేయి సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని