Suryakumar Yadav: సూర్య లాంటి ఆటగాళ్లను వందేళ్లకు ఓసారే చూస్తాం: కపిల్‌ దేవ్‌

టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)పై భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ (Kapil Dev) ప్రశంసల వర్షం కురిపించాడు.   

Updated : 09 Jan 2023 19:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ దిగ్గజం.. కపిల్‌ దేవ్‌ (Kapil Dev) స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)పై ప్రశంసలు కురిపించాడు. అతడు సచిన్‌ తెందూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, వివ్‌ రిచర్డ్స్‌ సరసన నిలిచే బ్యాటర్‌గా పోల్చాడు. అతడి లాంటి ఆటగాళ్లు వందేళ్లకు ఓసారి మాత్రమే వస్తారని ప్రశంసించాడు. టీ20 ఫార్మాట్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం  సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో కేవలం 51 బంతుల్లో 112 పరుగులు సాధించి పొట్టి ఫార్మాట్‌లో మూడో శతకాన్ని సూర్య తన ఖాతాలో వేసుకున్నాడు.

‘సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ని వర్ణించాలంటే ఒక్కోసారి నాకు మాటలు రావు. సచిన్‌ తెందూల్కర్‌, రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli)లను చూసినప్పుడు ఏదో ఒక రోజు సూర్య కుమార్‌ కూడా వారి సరసన చేరుతాడేమోనని అనిపిస్తోంది. సూర్యకుమార్‌ ఫైన్‌ లెగ్‌ మీదుగా ఆడే ల్యాప్‌షాట్‌ బౌలర్‌ను భయపెడుతుంది. అతడు నిలబడి మిడ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు. బౌలర్‌ ఎటువంటి బంతి వేస్తాడో కచ్చితంగా అంచనా వేస్తాడు. డివిలియర్స్‌, వివియన్‌ రిచర్డ్స్‌, సచిన్‌, విరాట్‌, రికీ పాంటింగ్‌ వంటి గొప్ప గొప్ప బ్యాటర్లను చూశాను. కానీ కొందరు మాత్రమే అతడిలా బంతిని క్లీన్‌గా కొట్టగలరు. హ్యాట్సాఫ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. ఇలాంటి ఆటగాళ్లను వందేళ్లకు ఒకసారి మాత్రమే చూస్తాం’’ అని కపిల్‌దేవ్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని