Kapil Dev: జడేజా ఎప్పుడూ అలా ఆడడు.. అందుకే అతడి ఆట ఇష్టం : కపిల్‌దేవ్

టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆట తనకెంతో ఇష్టమని దిగ్గజ సారథి కపిల్‌దేవ్‌ పేర్కొన్నారు. అతడు ఒత్తిడి లేకుండా ఆడటమే అందుకు కారణమని చెప్పారు...

Published : 14 Mar 2022 21:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆట తనకెంతో ఇష్టమని దిగ్గజ సారథి కపిల్‌దేవ్‌ పేర్కొన్నారు. అతడు ఒత్తిడి లేకుండా ఆడటమే అందుకు కారణమని చెప్పారు. తాజాగా ఫరిదాబాద్‌లో జరిగిన ఓ ఆస్పత్రిలో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సారథి‌.. జడేజాపై ప్రశంసల జల్లు కురిపించారు. జడ్డూ ఆటను ఆస్వాదిస్తూ ఆడతాడని, అందుకే అతడు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తాడని చెప్పారు. మరోవైపు ఫీల్డింగ్‌లోనూ తనదైన ప్రత్యేకత చాటుకున్నాడని తెలిపారు. క్రికెట్‌లో ఎవరైనా ఒత్తిడి తీసుకోకుండా ఆడితే బాగా ఆడతారని, ఒత్తిడి తీసుకుంటే సరిగ్గా ఆడలేరని పేర్కొన్నారు.

కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో జడేజా అదిరిపోయే ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా బౌలింగ్‌లోనూ 9 వికెట్లు (రెండు ఇన్నింగ్స్‌ల్లో) తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే కపిల్‌దేవ్‌ పేరిట ఉన్న ఓ రికార్డును తిరగరాశాడు. ఏడో స్థానంలో బరిలోకి దిగి టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. అంతకుముందు కపిల్‌ దేవ్‌ (169) పేరిట ఆ రికార్డు ఉండేది. ఇక ఈ మ్యాచ్‌ అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన జడేజా తర్వాత ఐసీసీ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని