IND vs USA: రోహిత్‌.. ఇది టెస్టు మ్యాచ్‌ కాదు: కపిల్ దేవ్

ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలంటే.. త్వరగా వికెట్లు తీయాలని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. అందుకోసం వికెట్లను తీసే బౌలర్‌తోనే బౌలింగ్‌ను ప్రారంభించాలని సూచించాడు.

Published : 12 Jun 2024 17:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) టీమ్‌ఇండియా వరుసగా రెండు విజయాలు సాధించి ‘సూపర్ - 8’ దిశగా దూసుకుపోతోంది. అయితే, బుమ్రా బౌలింగ్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌తోపాటు కెప్టెన్‌ రోహిత్ శర్మ తీసుకుంటున్న నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ స్పందించారు. స్టార్‌ పేసర్ బుమ్రాతో తొలి ఓవర్‌ వేయించకుండా సిరాజ్‌తో ప్రారంభించడంపై అసహనం వ్యక్తంచేశారు. వికెట్‌ టేకర్‌ను ఆలస్యంగా తీసుకొస్తే మ్యాచ్‌పై పట్టు చేజారే అవకాశం ఉందనేది వారి అభిప్రాయం. పాక్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రానే తొలి వికెట్‌ తీసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.

‘‘బుమ్రా మొదటి ఓవరే వేయాలి. అప్పుడే భారత్‌కు త్వరగా వికెట్‌ దక్కే అవకాశం ఉంటుంది. అతడిని ఐదు లేదా ఆరో బౌలర్‌గా తీసుకొస్తే.. మన చేతుల్లో నుంచి మ్యాచ్‌ చేజారిపోయే అవకాశం లేకపోలేదు. ఇది టెస్టు మ్యాచ్‌ కాదు. టీ20 ఫార్మాట్. ఎంత త్వరగా వికెట్‌ తీస్తే మ్యాచ్‌పై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థిపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురావచ్చు. సానుకూల దృక్పథంతో ముందుకుసాగాల్సిన అవసరం ఉంది. ఒకేవేళ బుమ్రా బౌలింగ్‌ను ఆరంభించి ఓ రెండు వికెట్లు తీయగలిగితే ఇతర బౌలర్లకు మార్గం సులువవుతుంది. 

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ముందుంటాడు. అయితే, అతడు ఎక్కువకాలం కొనసాగడం కష్టమేనని భావించాం. ఎందుకంటే అతడి బౌలింగ్‌ యాక్షన్‌ అంత ప్రమాదకరం. బుమ్రా శరీరంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ, మన అంచనాలు తప్పని బుమ్రా నిరూపించాడు. తనలో చాలా క్రికెట్ మిగిలిఉందని ప్రదర్శనతో చెప్పకనే చెప్పాడు’’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా సునీల్ గావస్కర్‌ కూడా బుమ్రాతో బౌలింగ్‌ ప్రారంభిస్తే బాగుండేదని సూచించాడు. 

నా ఫేవరెట్ క్రికెటర్ రోహిత్: మోనాంక్‌ పటేల్

మెరుగైన జీవితం కోసం చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. అలా వెళ్లినవారిలో యూఎస్‌ఏ క్రికెట్ జట్టు సారథి మోనాంక్ పటేల్‌ కూడా ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో జట్టును విజయపథంలో నడిపిస్తున్న అతడు.. కీలకమైన భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో ఆడటం ప్రతిఒక్కరి డ్రీమ్. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో మైలురాళ్లను నెలకొల్పారు. ఇలాంటి జట్టుతో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. నాణ్యమైన క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం. అందులో ఎలాంటి రాజీ ఉండదు. నా ఫేవరెట్‌ క్రికెటర్‌ రోహిత్ శర్మ. అతడితో కలిసి టాస్‌ వేసే అవకాశం రావడం ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన’’ అని మోనాంక్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని