Kapil Dev: ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సందేహాలుంటే ప్రపంచకప్‌నకు ఎంపిక చేయొద్దు: కపిల్ దేవ్

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను తెలుసుకోవడానికి ఆసియా కప్‌ సరైన వేదిక అని భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ (Kapil Dev)పేర్కొన్నాడు. ఆటగాడి ఫిట్‌నెస్‌పై ఏవైనా సందేహాలు ఉంటే అతడిని ప్రపంచకప్‌నకు ఎంపిక చేయవద్దని కపిల్‌దేవ్ సూచించాడు. 

Published : 26 Aug 2023 16:59 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌నకు టీమ్‌ఇండియా జట్టును ఇటీవల ప్రకటించారు. గాయాల కారణంగా కొన్ని నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul), శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)లు ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయ్యర్‌ పూర్తిస్థాయిలో కోలుకున్నప్పటికీ.. కేఎల్ రాహుల్ ఇంకా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో అతడు మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు తక్కువేనని చెప్పాడు. ఈ అంశంపై భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్ (Kapil Dev) మాట్లాడాడు. ఆసియా కప్‌నకు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ ఎంపిక సరైందే అని, ప్రపంచకప్‌ (World Cup 2023)నకు ముందు ప్రతి ఆటగాడి ఫిట్‌నెస్‌ను పరీక్షించాలన్నాడు. ప్లేయర్స్‌ ఫిట్‌నెస్‌ను తెలుసుకోవడానికి ఆసియా కప్‌ సరైన వేదిక అని పేర్కొన్నాడు.  ఆటగాడి ఫిట్‌నెస్‌పై ఏవైనా సందేహాలు ఉంటే అతడిని ప్రపంచకప్‌నకు ఎంపిక చేయవద్దని కపిల్‌దేవ్ సూచించాడు.

‘‘ప్రతి ఆటగాడిని టెస్ట్ చేయాలి. మరికొన్ని రోజుల్లో ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. ఇప్పటికీ మీరు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వరా?వారు ప్రపంచ కప్‌నకు వెళ్లి గాయపడితే జట్టు మొత్తం ఇబ్బందిపడుతుంది. ఆసియా కప్‌లో ఆటగాళ్లకు అవకాశం ఇస్తే కాస్త లయను అందుకుంటారు. దురదృష్టవశాత్తు ప్రపంచ కప్ సమయంలో ఆటగాళ్లు మళ్లీ గాయపడితే.. జట్టులో చోటు దక్కని ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుంది. గాయపడి తిరిగి జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. వారు ఫిట్‌గా ఉంటే ప్రపంచకప్‌లో ఆడొచ్చు.

ఆసియా కప్‌ టోర్నీకి కొవిడ్ ముప్పు ఉందా..?

మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. గాయపడిన ఆటగాళ్లు  ఫిట్‌గా లేకుంటే వెంటనే ప్రపంచ కప్ జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచ కప్ కోసం జట్టును రూపొందించడానికి ఆసియా కప్‌ రూపంలో అద్భుతమైన అవకాశం దొరికింది. తిరిగి జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు రాణించాలని కోరుకుంటున్నా. వారి ఫిట్‌నెస్‌పై ఏవైనా సందేహలుంటే పక్కన పెట్టేయండి. ఆసియా కప్‌లో మీరు వారికి అవకాశం ఇవ్వకపోతే అది ఆటగాళ్లకే కాకుండా సెలెక్టర్లకు అన్యాయం చేసినట్లవుతుంది. ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. మనం బెస్ట్, ఫిట్టెస్ట్ టీమ్‌ను ఎంచుకోవాలి’’ అని కపిల్‌దేవ్ సూచించాడు. 


రోహిత్‌ టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడు: సెహ్వాగ్  

రాబోయే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్‌ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 648 పరుగులు బాదాడు. ఇందులో 5 సెంచరీలున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే భారత పిచ్‌లపై ప్రపంచకప్‌లో ఓపెనర్లు భారీగా పరుగులు చేస్తారని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని భావిస్తున్నా. ప్రపంచకప్‌ అనగానే అతడు ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయి. ఆటతీరు కూడా మెరుగవుతుంది. ప్రస్తుతం అతడు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కాబట్టి.. అతడు భారీగా పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని సెహ్వాగ్ ఐసీసీతో పేర్కొన్నాడు. 


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని