T20 World Cup: ఫీల్డింగ్‌ మెడల్‌ ఎవరికి?ఎవరిచ్చారంటే?

టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో బెస్ట్‌ ఫీల్డింగ్‌ అవార్డును ఈసారి టీమ్‌ ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ అందించాడు. 

Updated : 28 Jun 2024 19:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup) సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను (England) భారత్‌ (India) చిత్తుచిత్తుగా ఓడించింది. 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. భారత క్రికెట్‌ జట్టు గత కొన్నాళ్లుగా ఆనవాయితీ చేస్తున్న బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ (Best Fielder Medal) ప్రధానం ఈసారి సరదా సరదాగా సాగింది. టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) డ్రెస్సింగ్‌ రూమ్‌కి వచ్చి నవ్వులు పూయించాడు. అలాగే టీమ్‌ కూడా తమ మాజీ సహచరుడు దినేశ్‌కు చప్పట్లతో ఘనస్వాగతం పలికింది. 

సెమీ ఫైనల్‌లో అద్భుత ఫీల్డింగ్‌తో ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు ఉత్తమ ఫీల్డర్‌ మెడల్‌ దక్కింది. ఆ అవార్డు ఇవ్వడానికి ఆహ్వానం మేరకు వచ్చిన డీకే.. తనను ఆహ్వానించడంపై జోకులు వేశాడు. ఇప్పటివరకు వివ్‌ రిచర్డ్స్‌, సచిన్ తెందూల్కర్‌, లాంటి దిగ్గజ ఆటగాళ్లు బహూకరించిన బెస్ట్‌ ఫీల్డింగ్‌ మెడల్‌ను తన లాంటి వారితో ఇప్పిస్తూ.. ఈ వేడుకను తక్కువ చేస్తున్నాడంటూ సరదాగా ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ను ఆటపట్టించాడు. బగ్గీ క్యామ్, స్పైడర్‌ క్యామ్‌లను కూడా వాడిన దిలీప్‌.. యూఎఫ్‌వో, ఏలియన్స్‌ను మాత్రమే వాడలేదు అని ఛలోక్తి విసిరాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఘొల్లున నవ్వేశారు.

ఇంగ్లిష్‌ జట్టుపై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాను డీకే ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘‘టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ సామర్థ్యాలను దిలీప్ అత్యున్నత స్థాయిలో నిలబెట్టాడు. మీరంతా ఇక్కడివరకు చేరుకునేందుకు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీ అందరికీ అభినందనలు. రెండేళ్ల క్రితం ఇదే మ్యాచ్‌, ఇదే ప్రత్యర్థి. ఆ మ్యాచ్‌లో ఘోర ఓటమి తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోని వాతావరణం నాకిప్పటికీ గుర్తుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. జట్టు ఎంపికలోనూ మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మీ అందరి ఆట అత్యద్భుతంగా ఉంది’’ అంటూ దినేశ్‌ కార్తిక్‌ కితాబిచ్చాడు. ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత ఎవరూ ఊహించని విధంగా జట్టులోకి వచ్చి, ఇప్పుడు అదరగొడుతున్నావ్‌ అంటూ రిషభ్‌ పంత్‌ను డీకే మెచ్చుకున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని