Hardik Pandya: హార్దిక్‌ నిర్ణయాలపై అజయ్‌ జడేజా ప్రశ్నలు.. స్పందించిన దినేశ్ కార్తిక్‌

ఐపీఎల్‌లో (IPL) తొలిసారి కెప్టెన్‌గా తన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు (GT) టైటిల్‌ను అందించిన సారథి హార్దిక్‌ పాండ్య (hardik pandya). తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కూ (ind vs sl) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Published : 07 Jan 2023 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించగా.. రెండో టీ20లో మాత్రం 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్సీపరంగా హార్దిక్ తన సహచరుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీంతో హార్దిక్‌ నాయకత్వం మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్లను ఆకట్టుకొంటోంది. ఈ క్రమంలో ‘పాత పద్ధతి’ని మార్చాల్సిన అవసరం ఏముందని మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా అడిగిన ఓ ప్రశ్నకు దినేశ్ కార్తిక్‌ సమాధానం ఇచ్చాడు. 

చివరి ఓవర్‌ను అక్షర్ పటేల్ (తొలి మ్యాచ్‌)కు బంతినివ్వడం, రెండో మ్యాచ్‌ హర్షల్‌ స్థానంలో అర్ష్‌దీప్‌ను తీసుకోవడం వంటి నిర్ణయాలపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘‘కొత్తగా వచ్చే ప్రతి కెప్టెన్‌ ఎందుకు పాత పద్ధతి మార్చాలని చూస్తుంటారు.? సిస్టమ్‌లోనే ఏమైనా సమస్య ఉందా..?’’ అని జడేజా క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ప్రశ్నించాడు. దీనికి ప్రతిస్పందనగా.. గత కొంతకాలంగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్‌ఇండియా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవడమే, మార్పులకు కారణం కావొచ్చని దినేశ్‌ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. 

‘‘2013 నుంచి భారత్‌ ఐసీసీ ఈవెంట్లలో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. అయితే 2014లో జట్టు పగ్గాలు చేపట్టిన వారు ఎలాంటి మార్పులు చేయలేదు. ఎందుకంటే అప్పటి వరకు వన్డే, టీ20 ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీని వంటి టోర్నీల్లో విజయాలను నమోదు చేసి ఉన్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు తమ ఆటతీరుతో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాం. అయితే ఆ తర్వాత నుంచి ఫలితాలు అనుకూలంగా రాలేదు. అందుకే జట్టు ఆడే విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది’’ అని డీకే వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని